పునరావాస కాలనీల్లో ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ పర్యటన
ABN , First Publish Date - 2021-10-29T05:42:21+05:30 IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురైన ఇందుకూరు-1, ఫజుల్లాబాద్-2, 3, కమలంపాలెం, ముసినిగుంట పునరావాస కాలనీల్లో ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ గురువారం అధికారులతో కలిసి పర్యటించారు.
దేవీపట్నం, అక్టోబరు 28: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురైన ఇందుకూరు-1, ఫజుల్లాబాద్-2, 3, కమలంపాలెం, ముసినిగుంట పునరావాస కాలనీల్లో ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ గురువారం అధికారులతో కలిసి పర్యటించారు. నిర్వాసితులతో ముఖాముఖి మాట్లాడారు. జరుగుతున్న పనులను పరిశీలించారు. గిరిజనులు తమ సమస్యలను కమిషనర్‌కు ఏకరువు పెట్టారు. వరద ముంపును సాకుగా చూపి నెల వ్యవధిలో అన్ని రకాల పరిహారాలు, భూమికి భూమి ఇస్తామని, మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీఇచ్చిమోసం చేశారని అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాగునీరు, వీధి దీపాలు లేవని పలు సమస్యలను వివరించారు. పునరావాస ప్రాంతాల్లో పనుల్వేక, ఉపాధి లేక భవిష్యత్తుపై భయాందోళన చెందుతున్నామన్నారు. పర్యటనలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొండమెదలు గ్రామానికి చెందిన కుండల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గిరిజనులు 28 రకాల సమస్యలతో 14 పేజీలతో కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.