బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు వాడపల్లి ముస్తాబు
ABN , First Publish Date - 2021-10-25T06:06:32+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొవిడ్ నిబంధనలను ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు వాహనాలపై స్వామివారు పుర మాఢవీధుల్లో భక్తులను కటాక్షించనున్నారు.

- వివిధ రకాల ఫల,పుష్పాలతో అలంకరణ
- ఆకట్టుకుంటున్న విద్యుద్దీపాలంకరణ
- ఉత్సవాలకు నేడు అంకురార్పణ
- తొమ్మిది రోజుల పాటు వాహనాలపై భక్తులను కటాక్షించనున్న వేంకటేశ్వరస్వామి
ఆత్రేయపురం, అక్టోబరు 24: ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొవిడ్ నిబంధనలను ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు వాహనాలపై స్వామివారు పుర మాఢవీధుల్లో భక్తులను కటాక్షించనున్నారు. మనసుదోచే విద్యుత్, ఫల, పుష్పాలంకరణతో శ్రీవారి ఆలయం, వెలుపల, పరిసర ప్రాంతాలను శోభాయ మానంగా తీర్చిదిద్దారు. వాడపల్లి కొత్త వంతెన వద్ద స్వాగత ద్వారాలు ఏర్పాటుచేశారు. ఉత్సవమూర్తులు కొలువుదీరనున్న మండపంలో చూడముచ్చటగా పుష్పాలంకరణ చేశారు. వాహనసేవలు నిర్వహించే ప్రాంగణాన్ని సుంద రంగా తీర్చిదిద్దారు. ఆలయ గోపురం, ముఖద్వారం, ప్రాకార మండపాలను విద్యుత్ సొబగులతో తీర్చిదిద్దారు. స్వామివారి అంతరాలయంలో పుష్పాలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ధ్వజస్తంభం, బలిపీఠం స్తంభాలకు విశేష అలంకరణ చేశారు. ఆలయ రాజగోపురంవద్ద వివిధ దేవతామూర్తుల విద్యుద్దీపాలంకరణ చేశారు. మామిడి, అరటి ఆకులతో మహాద్వారాన్ని అలంకరించారు. బ్రహ్మోత్సవాలకు కొద్దిమంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ ఉత్సవాలకు ప్రముఖులు తరలిరానున్న దృష్ట్యా ఏర్పాట్లు చేపట్టారు.
నేడు శాస్త్రోక్తంగా అంకురార్పణ:
బ్రహ్మోత్సవాల్లో తొలి ఘట్టమైన అంకురార్పణను ఆలయ ప్రాకారంలో సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, వాస్తు పూజ, అగ్నిమథనంలను వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించనున్నారు. యాగశాలను ఆవుపేడతో అలంకరించారు.
నేడు శేషవాహన సేవ:
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజైన సోమవారం విద్యుత్ వెలుగులు, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి శేషవాహన మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ చైర్మన్ రమేష్‌రాజు, ఈవో సతీష్‌రాజు తెలిపారు.