చెరువులో స్నానానికి దిగి బాలుడి మృతి
ABN , First Publish Date - 2021-03-21T06:01:06+05:30 IST
చెరువులో స్నానానికి దిగిన పదేళ్ల బాలుడు ఊబిలో చిక్కుకుని మృతిచెందాడు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట రాజీవ్‌గాంధీ కాలువగట్టుపై చెల్లా రాజేష్, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు.

సర్పవరం జంక్షన్, మార్చి 20: చెరువులో స్నానానికి దిగిన పదేళ్ల బాలుడు ఊబిలో చిక్కుకుని మృతిచెందాడు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట రాజీవ్‌గాంధీ కాలువగట్టుపై చెల్లా రాజేష్, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. రాజేష్ తేనె విక్రయించుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. వారికి పదేళ్ల డేవిడ్ రాజు అనే కుమారుడు ఉన్నాడు. స్థానిక గైగోలుపాడు మండల పరిషత్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్‌కు వెళ్లకుండా డేవిడ్ ఇంటి వద్దే ఉన్నాడు. సాయంత్రం సరదాగా ఇద్దరు స్నేహితులతో కలిసి పాత గైగోలుపాడులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు పక్కన ఉన్న గుబ్బలవారి చెరువులో దిగాడు. డేవిడ్ చెరువులోని ఊబిలో కూరుకుపోయాడు. స్నేహితులు భయంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు. సాలిపేట అగ్నిమాపక సిబ్బంది, సర్పవరం సీఐ నున్న రాజు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసారు. రాజేష్, నాగమణి దంపతులు కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించినట్లు సీఐ నున్న రాజు తెలిపారు.