ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్
ABN , First Publish Date - 2021-05-20T05:33:25+05:30 IST
‘జిల్లాలో కొందరిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు అనుమానితులను గుర్తించాం. ఈ వ్యాధికి వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాము. కొవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఇది వ్యాపిస్తుంది.

ఆర్‌ఎంపీలు కొవిడ్ వైద్యం చేస్తే కఠిన చర్యలు
39 ఆసుపత్రులకు రూ.1.54 కోట్ల ఫైన్
ఐదు ప్రైవేట్ ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు
కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
రాజమహేంద్రవరం,
మే 19 (ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో కొందరిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు
కనిపిస్తున్నాయి. ముగ్గురు అనుమానితులను గుర్తించాం. ఈ వ్యాధికి వైద్యం
కోసం కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాము. కొవిడ్ వచ్చి
తగ్గిన తర్వాత ఇది వ్యాపిస్తుంది. స్టెరాయిడ్స్ అధికంగా వాడడం వల్ల ఈ
వ్యాధి వస్తుందని, దీనిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం’ అని
కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో 100
పడకల కొవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మంత్రి చెల్లుబోయిన
వేణు, ఎంపీ మార్గాని భరత్, జేసీ కీర్తిలతో కలిసి విలేకరుల సమావేశంలో
మాట్లాడారు. ప్రైవేటు ఆసుపత్రులు ఉత్పత్తి కంపెనీల నుంచి వ్యాక్సిన్
కొనుగోలు చేసి 18 నుంచి 45ఏళ్లలోపు వయసు వారికి నిర్ణీత ధరకే వ్యాక్సిన్
వేయవచ్చన్నారు. కొవిడ్ సేవలకు వైద్య విద్య మూడో సంవత్సరం చదువుతున్న
విద్యార్థుల సహకారం కూడా తీసుకుంటామన్నారు. జిల్లాలో 505 ఐసీయూ యూనిట్లు,
3,300 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్
ఆసుపత్రుల్లోనూ 50 శాతం బెడ్‌లను ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాలన్నారు.
ఇన్సూరెన్స్ స్కీమ్‌ల్లో వైద్యం చేయించుకునే వారికి ప్రైవేట్ ఆసుపత్రులు
కచ్చితంగా బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రులను
తనిఖీ చేసి రూ.1.54 కోట్లు ఫైన్ వేశామని, ఐదు ఆసుపత్రులపై క్రిమినల్
కేసులు పెట్టామని తెలిపారు. ఆర్‌ఎంపీలు, ప్రైవేట్ వైద్యులు ఇష్టానుసారం
రెమ్‌డిసివిర్, స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల దుష్ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఆర్‌ఎంపీలు ఎవరైనా కొవిడ్ బాధితులకు వైద్యం చేస్తే కఠిన చర్యలు
తీసుకుంటామని హెచ్చరించారు. ‘ప్రతీ గ్రామంలోనూ సర్పంచ్ ఆధ్వర్యంలో కరోనా
కట్టడికి బృందాలు ఏర్పాటు చేశాం. మా గ్రామం మా బాధ్యత. కరోనా నుంచి
మా గ్రామాన్ని కాపాడుకుంటాం... అనే నినాదంతో కార్యక్రమం చేపట్టామ’న్నారు.
మహిళా పోలీసులను కూడా ఈ సేవలకు వినియోగిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు.
సమావేశంలో కొవిడ్ ప్రత్యేకాధికారి ఒ.ఆనంద్, సబ్ కలెక్టర్ అనుపమ అంజలి,
మునిసిపల్ కమిషనర్ అభిషిక్త్ కిశోర్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్
రమేష్‌కిశోర్, అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ కోమల, ఆరోగ్యశ్రీ
కో-ఆర్డినేటర్ ప్రియాంక, వైసీపీ రూరల్ కో-ఆర్డినేటర్ చందన నాగేశ్వర్,
పేపరుమిల్లు ప్రతినిధులు సూరారెడ్డి, అశోక్‌కుమార్ సింగ్,
సూపరింటెండెంట్ చిన్నిహాసన్ తదితరులు పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు
బ్లాక్ ఫంగస్ చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి తెలిపారు. వంగా గీత మిలీనియం బ్లాక్‌లోని న్యూరాలజీ వార్డులో 10 బెడ్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం ఇక్కడ రెండు బ్లాక్ ఫంగస్ కేసులున్నాయని, బాధితులకు చికిత్స అందిస్తున్నామన్నారు. ఈఎన్‌టీ, ఆప్తల్మాలజీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ వైద్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. కరోనా వైరస్ సోకిందని అధికంగా స్టెరాయిడ్స్ వాడరాదని, చక్కెర వ్యాధిగ్రస్తులు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని కోరారు. నోటి ని పొడిగా ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రంచేసుకోవాలని సూచించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తిం చి వెంటనే అప్రమత్తమై చికిత్స తీసుకోవాలన్నారు.