Andhra BJP chief Somu Veerraju మరోసారి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-12-31T18:46:21+05:30 IST
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

రాజమహేంద్రవరం: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాము అధికారంలో వచ్చాక మద్యాన్ని తక్కువ ధరకే ఇస్తామని ఇటీవల బీజేపీ బహిరంగ సభలో ప్రకటిస్తూ విమర్శలపాలయ్యారు. దీంతో సోమువీర్రాజును కాస్త నెటిజన్లు ‘సారాయి వీర్రాజు’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. అయితే నిత్యం ఇలా వార్తల్లో నిలవడమే పనిగా పెట్టుకున్నారో ఏమోగానీ తాజాగా వీర్రాజు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ మహానగరంలో కేజీహెచ్ ఆస్పత్రి పేరు వెంటనే మార్చాలంటూ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ‘‘అసలు కింగ్ జార్జ్ ఎవరు... ఇందులో కింగ్ ఎవరు..? జార్జ్ ఎవరు..?’’ వెంటనే ఈ పేరు మార్చాలని డిమాండ్ చేశారు.
అంతటితో ఆగని ఆయన.. కేజీహెచ్ ఆస్పత్రికి ఏం పేరు పెట్టాలో కూడా సెలవిచ్చారు. కేజీహెచ్‌ను ‘సర్ధార్ గౌతులచ్చన్న’ పేరు బీజేపీ ప్రతిపాదిస్తోందని చెప్పుకొచ్చారు. ఇక్కడ త్యాగశీలుర పేర్లు పెట్టాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. అయితే తాజా ప్రకటనతో మరోసారి అటు మీడియాలో.. ఇటు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ ప్రతిపాదనపై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.