భూకంపం తర్వాత తీరంలో తగ్గిన కెరటాలు.. ఆందోళనలో మత్స్యకారులు!

ABN , First Publish Date - 2021-08-25T06:47:19+05:30 IST

బంగాళాఖాతంలో మంగళవారం సంభవించిన భూకంపం జిల్లా ప్రజలను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. ఎప్పుడూలేని రీతిలో కాకినాడ, రాజోలు తీర ప్రాంతాల నుంచి 300లోపు కిలోమీటర్ల పరిధిలో సముద్ర గర్భంలో చోటుచేసుకున్న ప్రకంపనలు అలజడి రేపాయి.

భూకంపం తర్వాత తీరంలో తగ్గిన కెరటాలు.. ఆందోళనలో మత్స్యకారులు!
భూకంపం తర్వాత ఉప్పాడ తీరంలో తగ్గిన కెరటాల ఉధృతి

బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం

రాజోలు నుంచి 257, కాకినాడ నుంచి 296 కిలోమీటర్ల దూరంలో  కడలిలో ప్రకంపనలు

ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోతున సముద్రగర్భంలో ఘటన

రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదు

జిల్లావ్యాప్తంగా ఉలిక్కిపడ్డ తీర ప్రాంత ప్రజలు

భూకంప ప్రభావంతో అనూహ్యంగా తగ్గిన కెరటాల ఉధృతి


(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

బంగాళాఖాతంలో మంగళవారం సంభవించిన భూకంపం జిల్లా ప్రజలను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. ఎప్పుడూలేని రీతిలో కాకినాడ, రాజోలు తీర ప్రాంతాల నుంచి 300లోపు కిలోమీటర్ల పరిధిలో సముద్ర గర్భంలో చోటుచేసుకున్న ప్రకంపనలు అలజడి రేపాయి. సమాచారం తెలుసుకున్న తీర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముప్పు ఎటువైపు వస్తుందోనని ఆందోళన చెందారు. అయితే స్వల్ప సమయమే ప్రకంపనలు చోటుచేసుకుని అని తర్వాత సద్దుమణగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వాస్తవానికి గడిచిన కొన్నేళ్లుగా జిల్లాలో ఉప్పాడ, అంతర్వేది తీర ప్రాంతాల్లో సముద్రం క్రమేపీ ముందుకు చొచ్చుకు వస్తుండడంతో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. కోత పెరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో మంగళవారం జిల్లాలో తీర ప్రాంతానికి సమీపంలో భూంకంపం వచ్చిందన్న సంగతి ఒకింత ఆందోళన రేకెత్తించింది. సరిగ్గా మధ్యాహ్నం 12.35 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. బంగాళాఖాతంలో సముద్రం ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోతున సముద్ర గర్భంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.1గా నమోదైనట్టు నేషనల్‌ జియో ఫిజికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రకటించింది. అయితే ఈ భూకంపం జిల్లాలో రాజోలు తీర ప్రాంతం నుంచి సముద్రంలో 257 కి.మీ దూరంలో సంభవించింది. కాకినాడ తీరం నుంచి నుంచి ఆగ్నేయంగా 296,   రాజమహేంద్రవరం నుంచి 312 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం చోటుచేసుకుంది. కాగా తక్కువ స్థాయి ప్రకంపనల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. కాగా భూకంపం తర్వాత సముద్రంలో ఒకరకంగా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఎప్పుడూ రాకాసి అలలు విరుచుకుపడే ఉప్పాడలో భూకంపం ప్రభావంతో కెరటాలు పూర్తిగా తగ్గిపోయాయి. మునుపటితో పోల్చితే కెరటాల తీవ్రత తగ్గిపోవడంపై మత్స్యకారులు ఒకరకంగా ఆందోళన వ్యక్తం చేశారు. చాప తరహాలో కెరటాలు లేకుండా సమద్రం అరుదుగా కనిపిస్తుందని, మంగళవారం మధ్యాహ్నం ఇలా కనిపించడంతో లోపల ఏదో జరగడం వలనే ఈ మార్పులు కనిపించాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో గతంలో పలుసార్లు భూకంపం సంభవించింది. అయితే జిల్లా తీర ప్రాంతానికి సమీపంలో ఎప్పుడూ ఇటువంటివి చోటుచేసుకోలేదు. ముఖ్యంగా బంగాళాఖాతంలో 2012లో భూకంపం రావడంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ తర్వాత భూకంపం ముప్పు వాటిల్లలేదు. కాగా తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు తూర్పు తీరానికి భూకంపం, సునామీ ముప్పు ఉందని రెండేళ్ల కిందట శాస్త్రవేత్తల బృందం హెచ్చరిచింది. కృష్ణా-గోదావరి బేసిన్‌లో 300 కిలోమీటర్ల మేర సముద్రగర్భంలో పొడవాటి పగుళ్లు (ఫాల్ట్‌ లైన్‌) ఉన్నట్టు గుర్తించారు. ఇది తీరం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉందని  ఓ అధ్యయనంలో గుర్తించారు. ఈ  పగుళ్లకు ఎప్పుడైనా ఒత్తిడి పెరిగితే బారీ చీలిక ఏర్పడి భూకంపం సంభవించవచ్చని హెచ్చరించారు. ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ జర్నల్‌లో ఈ అధ్యయన సారాంశం ప్రచురితమైంది. అయితే ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకోవడం విశేషం. కాగా మంగళవారం నాటి భూప్రకంపనల నేపథ్యంలో కాకినాడ తీరాన్ని పోలీసులు పరిశీలించారు. మత్స్యకారులు, పర్యాటకులు తీరం వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - 2021-08-25T06:47:19+05:30 IST