బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేసులో రెండు రోజుల్లో చార్జిషీట్లు

ABN , First Publish Date - 2021-12-07T07:06:36+05:30 IST

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా-జయపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ కుంభకోణంలో నిందితులను ఊచలు లెక్కించేటట్టు చేయడానికి సీఐడీ రాజమహేంద్రవరం జోనల్‌ కార్యాలయం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేసులో రెండు రోజుల్లో చార్జిషీట్లు

నిందితులను పిలిచి వివరాలు సేకరిస్తున్న సీఐడీ 

బ్యాంకు అధికారుల ప్రస్తుత వివరాలు కూడా...

జయపూర్‌ షుగర్‌ కంపెనీ నుంచి స్పందన శూన్యం

రాజమహేంద్రవరం, డిసెంబరు 6 (ఆంధ్ర జ్యోతి): బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా-జయపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ కుంభకోణంలో నిందితులను  ఊచలు లెక్కించేటట్టు చేయడానికి సీఐడీ రాజమహేంద్రవరం జోనల్‌  కార్యాలయం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల్లో కాకినాడ సీఐడీ కోర్టులో నిందితులందరిపై చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు. సుమారు 60 మందిపై చార్జిషీటు సిద్ధం చేశారు. అయితే ఇందులో 24 మంది వరకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. మిగతా వారు చాగల్లులోని జయ్‌పూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీకి చెందిన బాధ్యులు, ఉద్యోగులు, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే ఇతర వ్యక్తులు ఉన్నారు. వీరందరికీ సీఐడీ అడిషనల్‌ ఎస్పీ గోపాలకృష్ణ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కానీ వారిలో బ్యాంకు అధికారులు మాత్రమే ఇక్కడ హాజరవుతున్నారు. మిగతా వారి నుంచి    ఇప్పటి వరకు స్పందన లేదు. 

ప్రస్తుత చిరునామాల సేకరణ

అప్పట్లో ఈ కుంభకోణానికి బాధ్యులుగా ఉన్న బ్యాంకు అఽధికారులు, ఉద్యోగుల నుంచి సమాచారాన్ని సీఐడీ అధికా రులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం    ఎక్కడ నివాసం ఉంటున్నారు. ఎక్కడ పనిచేస్తున్నారు. గతంలో ఇచ్చిన ఫోన్‌ నంబర్లు మారాయా? ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌  నంబర్లు ఏంటి? నిందితులంతా ప్రస్తుతం   ఉద్యోగాల్లో ఉన్నారా, రిటైరయ్యారా? అందరూ బతికే ఉన్నారా, లేక ఎవరైనా చనిపోయారా  తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఆధార్‌ కార్డు నెంబరు, ఫోన్‌ నంబరు సహా వారి నివాస వివరాలన్నీ సేకరిస్తున్నారు. సోమవారం కొంతమంది వచ్చి సమాచారం ఇచ్చి వెళ్లారు.

 బెయిల్‌ పేరిట డబ్బులు వసూలు?

ఈ పెండింగ్‌ కేసును ఓ కొలిక్కి తేవడానికి సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొందరు బ్యాంకు అధికారులు, ఇందులో నిందితులుగా ఉన్నవారు కూడా మిగతావారి నుంచి బెయిల్‌ ఇప్పిస్తామని చెప్తూ కొంత డబ్బు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బహుశా చార్జిషీటు దాఖలు చేస్తున్నారు కాబట్టి అరెస్టు  తర్వాత ఉంటాయనే ఆలోచనతో ఈ బెయిల్‌ ప్రస్తావన తెస్తున్నారేమో అని తెలుస్తోంది.Updated Date - 2021-12-07T07:06:36+05:30 IST