అయ్యప్పస్వామి ఆలయంలో వైవీ పూజలు
ABN , First Publish Date - 2021-12-30T06:33:17+05:30 IST
రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ సమీపంలో ఉన్న అయ్యప్ప స్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 29: రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ సమీపంలో ఉన్న అయ్యప్ప స్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆహ్వానం మేరకు ఆయన బుధవారం అయ్యప్ప ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆల య కమిటీ పెద్దలు తోట సుబ్బారావు, పొలసానపల్లి హనుమంతరావు, జక్కంపూడి విజయలక్ష్మిలు సాదరంగా స్వాగతం పలుకగా, వేదపండితులు వేద మంత్రోచ్చారణలతో స్వాగతించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ విశిష్టతను జక్కంపూడి రాజా వివరించారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు సంకల్పంతో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి చేసిన కృషిని వివరించారు. శబరిమలలో అయ్యప్పను దర్శించుకుంటే ఏ అనుభూతి కలుగుతుంతో అదే అనుభూతి కలిగిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని గుర్తిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఆలయ నిర్మాణానికి అన్నిచర్యలు తీసుకుంటానని అన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ వైవీ సుబ్బారెడ్డి అయ్యప్పస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వైవీ సుబ్బారెడ్బి వెంట జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, రుడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ మాజీ కోఆర్డినేటర్ శ్రీఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం, స్మార్ట్ సిటీ చైర్మన్ చందన నాగేశ్వర్, వైసీపీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, నాయకులు బొంత శ్రీహరి, ఇసుకపల్లి శ్రీను, మానే దొరబాబు, కేశవరాజు, అడపా అనిల్ తదితరులు పాల్గొన్నారు.