వెల్లలో నకిలీ ఆయుర్వేద నిలయం

ABN , First Publish Date - 2021-12-25T05:42:25+05:30 IST

రామచంద్రపురం మండలం వెల్లలో సంతోషి ఆయుర్వేద నిలయం పేరుతో అర్హత, అనుమతులు లేకుండా పలు రోగాలకు మందులు, వైద్యం చేయడంపై ఆయుష్‌ ప్రాంతీయ ఉపసంచాలకుడు డాక్టర్‌ వెంకటకృష్ణ శుక్రవారం తనిఖీ చేశారు.

వెల్లలో నకిలీ ఆయుర్వేద నిలయం
ఆయుర్వేద నిలయంలో తనిఖీ చేస్తున్న డాక్టరు వెంకటకృష్ణ

 అర్హత, అనుమతులు లేకుండా వైద్యం
వైద్యం వికటించడంతో ఫిర్యాదు.. ఆయుష్‌ ఆర్‌డీడీ తనిఖీ

ద్రాక్షారామ, డిసెంబరు 24: రామచంద్రపురం మండలం వెల్లలో సంతోషి ఆయుర్వేద నిలయం పేరుతో అర్హత, అనుమతులు లేకుండా పలు రోగాలకు మందులు, వైద్యం చేయడంపై ఆయుష్‌ ప్రాంతీయ ఉపసంచాలకుడు డాక్టర్‌ వెంకటకృష్ణ శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల మండపేట మండలంలో ఒక వ్యక్తికి సంతోషి ఆయుర్వేద నిలయం నుంచి మందు ఇచ్చి వైద్యం చేశారు. వైద్యం వికటించడంతో ప్రాణాపాయస్థితిలో మండపేట ప్రభుత్వాస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. ఈ మేరకు మండపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మండపేట పోలీస్‌స్టేషన్‌ నుంచి ఆయుష్‌ శాఖకు ఫిర్యాదు చేరింది. దీంతో ఆయుష్‌ ఆర్‌డీడీ డాక్టరు వెంకటకృష్ణ సంతోషి ఆయుర్వేద నిలయంలో తనిఖీలు జరిపారు. వీరికి ఆయుష్‌ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు, అర్హతలు లేవని ధ్రువీకరించారు. ఇలా చేయడం నేరమన్నారు. సంతోషి ఆయుర్వేద వైద్యాలయం నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వైద్యాలయంలో మందులకు సంబంధించి నమూనాలు తీసుకున్నారు. నమూనాలు డ్రగ్స్‌ పరిశీలనకు పంపుతామని డాక్టర్‌ వెంకటకృష్ణ తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌కు మందులు ఇస్తామని పలువురు ప్రకటనలు ఇస్తున్నారని, వారికి ఎటువంటి అనుమతులు లేవని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Updated Date - 2021-12-25T05:42:25+05:30 IST