అమరావతే రాజధాని

ABN , First Publish Date - 2021-11-23T07:02:22+05:30 IST

అమరావతే ఏకైక రాజధానిగా ప్రకటించి పరువు దక్కించుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ హితవు పలికారు.

అమరావతే రాజధాని

ఇప్పటికైనా ప్రకటించండి.. గందరగోళం వద్దంటున్న ప్రజలు

ఇది అమరావతి రైతుల విజయం.. స్పష్టత ఇచ్చి పరువు దక్కించుకోండి

న్యాయపరమైన చిక్కులు తప్పించుకునేందుకు ఎత్తుగడ అని విమర్శ

సర్వత్రా ఇదే చర్చ.. 3 రాజధానుల బిల్లుతో సర్వత్రా హర్షాతిరేకాలు

శాసనసభలో మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో జిల్లా అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికైనా జగన్‌ తన నిర్ణయం తప్పని తెలుసుకున్నారని పలువురు వ్యాఖ్యానించారు. కానీ  రద్దు నిర్ణయం ప్రకటిస్తూనే గందరగోళానికి దారితీసేలా పలు అంశాలను ప్రస్తావించడంపై మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. మెరుగైన బిల్లు తెస్తామని ప్రకటన చేయడాన్ని తప్పు పడుతున్నారు. ఒకే రాజధాని అమరావతి ఉంటుందనే స్పష్టత ఇవ్వకపోవడంపై మళ్లీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టులో తీర్పు దశకు చేరుకున్న రాజధాని కేసు విషయంలో న్యాయపరమైన చిక్కులను తప్పించుకోవడానికే ఇలా ఎత్తుగడ వేశారని టీడీపీ దుయ్యబట్టింది. రైతుల సుదీర్ఘ పోరాటాన్ని గౌరవించి, అమరావతే రాజధాని అనే ప్రకటన తక్షణం చేయాలని డిమాండ్‌ చేసింది.

బిల్లు రద్దు  రైతుల విజయం : వనమాడి

కాకినాడ సిటీ, నవంబరు 22: అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడం అమరావతి రైతుల విజయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు ఏడొందల రోజుల నుంచి ఎండనక, వాననక ప్రకృతి వైపరీత్యాలను సైతం లెక్క చేయకుండా నిరసన దీక్షలు చేసి ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపి మానసిక క్షోభకు గురై ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇది చారిత్రాత్మక విజయమని, అమరావతి రైతుల త్యాగాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండున్నర సంవత్సరాలుగా తీసుకున్న తప్పుడు నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని కోరారు.

ఇప్పటికైనా పరువు  దక్కించుకోండి : గన్ని

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 22: అమరావతే ఏకైక రాజధానిగా ప్రకటించి పరువు దక్కించుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ హితవు పలికారు. హైకోర్టులో రాజఽధానుల కేసు ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో మూడు రాజఽధానుల బిల్లును రద్దు చేస్తూ, మరింత మెరుగైన చట్టాన్ని తీసుకువస్తామని సీఎం శాస నసభలో చేసిన ప్రకటన మరింత అనిశ్చితిని కలిగిస్తుందని, ఇంకో రూపంలో మూడు రాజధానుల చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నం కనిపిస్తోందన్నారు. తక్షణమే జనాభిప్రాయాన్ని గౌరవించి, అమరావతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

రైతుల ఉద్యమానికే వెనక్కు తగ్గింది : ఆదిరెడ్డి

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 22: అమరావతే రాష్ట్ర రాజధానిగా ఉంచాలని రైతులు చేసిన ఉద్యమానికి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. మూడు రాజధానులు, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్టీఏ రద్దు బిల్లులను కేబినెట్‌ రద్దు చేసినట్టు అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో ఆదిరెడ్డి స్పందించారు. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అందరికి అను కూలమైన అమరావతిని రాజధానిగా చేసేందుకు పడిన కష్టం, రైతుల అవిశ్రాంత ఉద్యమం ఊరికే పోలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆ ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇది అమరావతి రైతుల విజయం : గొల్లపల్లి

రాజోలు, నవంబరు 22: అసెంబ్లీలో మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడం పట్ల మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వెనక్కు తీసుకున్న మూడు రాజధానుల రద్దు నిర్ణయం అమరావతి రైతుల విజయమన్నారు. నిజానికి ఆనాడు చంద్రబాబు రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయమే చారిత్రాత్మకమైందన్నారు.

చిక్కులు తప్పించుకునేందుకే బిల్లు వెనక్కి : బండారు

కొత్తపేట, నవంబరు 22: న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికే రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వికేంద్రీకరణ బిల్లు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినప్పటికీ మరో బిల్లు తెస్తామనడం ప్రభుత్వ వైఖరిలో మార్పులేదని అర్థమవుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆలోచనలు, కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని బండారు చెప్పారు.

అమరావతిని రాజధానిగా ప్రకటించండి : పిల్లి

సర్పవరం జంక్షన్‌, నవంబరు 22: రాష్ట్ర రాజధానిగా అమరావతిని సీఎం జగన్‌ తక్షణమే ప్రకటించాలని, సీఆర్డీయే రద్దంటూనే నూతనంగా బిల్లు పెడతామంటూ ప్రభుత్వం ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమూర్తి విమర్శించారు. సోమవారం వాకలపూడిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఆర్డీయే బిల్లు రద్దు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం మంచి పరిణామమన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ, రైతులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారన్నారు. ఇదేవిధంగా సీఆర్డీయే చట్టం రద్దును ఉపసంహరించుకోవడమే కాకుండా అమరావతిని తక్షణం రాజధానిగా ప్రకటించాలని కోరారు.




Updated Date - 2021-11-23T07:02:22+05:30 IST