అన్నీ బేరాలేనమ్మా!
ABN , First Publish Date - 2021-02-26T06:55:51+05:30 IST
మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అధికార వైసీపీ తెరవెనుక వ్యూహాలకు అప్పుడే పదును పెట్టింది. అంగ, అర్థబలంతో ఎక్కువ మున్సిపాల్టీల్లో విజయం సాధించడం కోసం ఎత్తుగడలు అమలు చేస్తోంది. ఎక్కువ వార్డులు ఏకగ్రీవం చేసుకుని సునాయాసంగా గెలవాలనే పథకంతో పావులు కదుపుతోంది.

- మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం తెరవెనుక వ్యూహాలకు వైసీపీ పదును
- వార్డుల్లో ఏకగ్రీవాలకు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు లక్ష్యంగా ప్రలోభాల వల
- నామినేషన్ విత్డ్రా చేస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆఫర్లు
- మాట వినకుంటే కేసులు తిరగదోడుతామంటూ బెదిరింపులు
- ఒకవేళ పోటీ తప్పనిసరైతే అధికార బలంతో నెట్టుకువచ్చేలా ప్లాన్
- ఓట్లు వేయించకపోతే ఉద్యోగం తీసేస్తామంటూ వలంటీర్లకు వార్నింగ్లు
- మరోపక్క యానాం, తెలంగాణ నుంచి భారీగా మద్యం డంపింగ్
మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అధికార వైసీపీ తెరవెనుక వ్యూహాలకు అప్పుడే పదును పెట్టింది. అంగ, అర్థబలంతో ఎక్కువ మున్సిపాల్టీల్లో విజయం సాధించడం కోసం ఎత్తుగడలు అమలు చేస్తోంది. ఎక్కువ వార్డులు ఏకగ్రీవం చేసుకుని సునాయాసంగా గెలవాలనే పథకంతో పావులు కదుపుతోంది. అందుకోసం ప్రత్యర్థి టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని బేరసారాలకు దిగుతోంది. అభ్యర్థి బలాబలాల ఆధారంగా వార్డుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ప్రలోభాల వల విసురుతోంది. ఇచ్చిన ఆఫర్ తీసుకుని అభ్యర్థిత్వం ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తోంది. కాదంటే కేసులు తప్పవని బెదిరిస్తోంది. పోటీతప్పని సరైన చోట నెట్టుకు రావడానికి వార్డు వలంటీర్లపై ఒత్తిళ్లు తెస్తోంది.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో జరగనున్న ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా 80 శాతం సీట్లు గెలవాలని అధిష్ఠానం ఆదేశించడంతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు చీకటి వ్యూహాలకు పదునుపెట్టారు. అందుకోసం ఎన్నికలకు ముందు సాధ్యమైనన్ని వార్డులను ఏకగ్రీవం చేయించి తమ పట్టు నిరూపించుకునేందుకు పావులు కదుపుతున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నచోట కోట్లలో ఖర్చు చేయడానికి నగదు సిద్ధం చేస్తున్నారు. తుని మున్సిపాల్టీలో 30 వార్డులను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో కీలకనేత ఎంతవరకైనా వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొన్ని వార్డుల్లో టీడీపీ నుంచి నామినేషన్లే లేకుండా చేయగా, ఇప్పుడు బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులకు నగదు ఎర విసురుతున్నారు. వచ్చే నెల విత్డ్రా గడువులోగా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటే రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తామని బేరాలు నడుపుతున్నారు. గట్టి అభ్యర్థి అయితే రూ.8 లక్షల వరకు ఇస్తా మంటున్నారు. దారికిరాకపోతే ఏదొక కేసు బనాయించి అభ్యర్థిని జైలుకు పంపుతామని హెచ్చరికలు కూడా పంపుతున్నారు. ఇప్పటికే రెండు వార్డులకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులను ఇదే రీతిన బెదిరించారు. పిఠాపురం మున్సిపాల్టీలో తీవ్రపోటీ ఉండడంతో ఒక్కో టీడీపీ వార్డు సభ్యుడికి రూ.10 లక్షల వరకు ఇస్తామంటూ ఆఫర్లు పంపుతున్నారు. నగదుతోపాటు మున్సిపాల్టీలో అధికారం వచ్చాక వర్కులు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. మాట వినని ఓ అభ్యర్థిని, మరో అభ్యర్థి భర్తపై ఇప్పటికే కేసులు కూడా పెట్టించారు. గొల్లప్రోలులో ఒక్కో వార్డుకు రూ.5 లక్షల వరకు బేరం పెట్టారు. సామర్లకోట మున్సిపాల్టీలో వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఆ సీటులో తన వారిని కూర్చోబెట్టాలనే కల నెరవేర్చుకోవడానికి సాధ్యమైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలు చేయించుకునేందుకు వార్డుకు రూ.3 లక్షల వరకు వెదజల్లడానికి ప్రణాళికలు వేశారు. పెద్దాపురం వైసీపీలో చైౖర్పర్సన్ పదవికి పోటీ తీవ్రంగా ఉండడంతో ఇద్దరు అభ్యర్థులైతే పోటాపోటీగా ఏకగ్రీవాలు చేయించి తమ పట్టేంటో నిరూపించుకునేందుకు ఎంతైనా వెచ్చించడానికి సిద్ధమయ్యారు. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఒక్కో వార్డులో టీడీపీ అభ్యర్థులకు రూ.5 లక్షలు, ఇంటి స్థలం ఇస్తామంటూ చర్చలు జరుపుతున్నారు. నియోజకవర్గ కీలక నేత ఇక్కడ గెలుపును వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ టీడీపీ అభ్యర్థులు వెనక్కు తగ్గకపోవడంతో కేసుల బూచీ చూపిస్తున్నారు. రామచంద్రపురంలో వైసీపీ కీలక నేత అప్పుడే మున్సిపాల్టీలో సగానికిపైగా వార్డులు ఏకగ్రీవం చేయించుకునేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. ఈ మేరకు టీడీపీ అభ్యర్థులతో సంప్రదింపులు జరిపారు. కానీ విత్డ్రా సమయం వచ్చే వరకు అంతా అను కున్నట్టు జరుగుతుందా?లేదా? అనే బెంగ వేధిస్తోంది. అమలాపురంలో ఇప్పటికే కొన్ని వార్డులను ఏకగ్రీవం చేయించగా, మరికొన్ని దారికితెచ్చుకునేందుకు వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. మండపేటలో ఏకగ్రీవాల ప్రసక్తే లేకపోవడంతో రూ.5 కోట్ల వరకు వెచ్చించి నగదు బలంతో పాగా వేయాలని వైసీపీ పావులు కదుపుతోంది.
- కొలువు పీకేస్తాం...
పోటీ తప్పనిసరైన వార్డుల్లో గెలుపు బాధ్యత ఆయా మున్సిపాల్టీ పరిధిలో వార్డు వలంటీర్లు మోయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఇప్పటికే హెచ్చరికలు పంపారు. తమ పరిధిలో ఇంటింటికి వెళ్లి పార్టీకి ప్రచారం చేయించి ఓట్లు వేయించాలని హుకుం జారీచేశారు. ఏలేశ్వరం నగర పంచాయతీ వార్డు వలంటీర్లతో ఇటీవల ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ రహస్య సమావేశం నిర్వహించే ప్రయత్నం చేయగా బెడిసికొట్టింది. దీంతో తెరవెనుక నేరుగా హెచ్చరికలు పంపుతున్నారు. పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, రామచంద్రపురం తదితర చోట్ల వైసీపీ ఓడిపోయే వార్డులో ఉద్యోగం తీయించేస్తామంటూ వలంటీర్లకు హెచ్చరికలు పంపారు. అటు తుని, ఏలేశ్వరం, మండపేట, ముమ్మిడివరం, అమలాపురం మున్సిపాల్టీల పరిధిలో మద్యం ఏరులైపారించడం కోసం తెలంగాణ, యానాం నుంచి భారీగా అధికార పార్టీ నేతలు సరుకు డంప్ చేయించారు.