అన్యదేశ వృక్ష జాతులపై అప్రమత్తత అవసరం
ABN , First Publish Date - 2021-10-22T05:29:48+05:30 IST
అడవుల విస్తరణ, ప్లాంటేషన్ తయారీలో భాగంగా ఎక్సోటిక్ (అన్యదేశాల జాతుల) మొక్కలను, విత్తనాలను నాటే విషయంలో అటవీసిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని అసిస్టెంట్ సిల్వి కల్చరిస్ట్ ఎన్‌వీ శివరామ్ అన్నారు.

దివాన్‌చెరువు, అక్టోబరు 21: అడవుల విస్తరణ, ప్లాంటేషన్ తయారీలో భాగంగా ఎక్సోటిక్ (అన్యదేశాల జాతుల) మొక్కలను, విత్తనాలను నాటే విషయంలో అటవీసిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని అసిస్టెంట్ సిల్వి కల్చరిస్ట్ ఎన్‌వీ శివరామ్ అన్నారు. స్థానిక రాష్ట్ర అటవీ అకాడమీలో అటవీ సెక్షన్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంపై గురువారం ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. అడవులు, గ్రామ శివార్లలో వివిధ జాతుల మొక్కలను గుర్తించడంలో మెళకువలను ఆయన వివరించారు. ఇతర దేశాల చెట్లు, మొక్కలను పెంచడానికి ఉత్సాహం చూపడం తప్పుకాకపోయినా అవి స్థానిక వాతావరణంపై చూపే ప్రభావాన్ని అంచనా వేయడంలో అశ్రద్ధ తగదన్నారు. కొన్ని విదేశీ వృక్ష జాతులను వ్యాపార ప్రయోజనాల పేరుతో ఇక్కడికి దిగుమతి చేసాశారని, వాటి వల్ల పెంచే వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరకపోగా వాతావరణ సమతుల్యత దెబ్బతిన్న పరిస్థితులున్నాయన్నారు. విదేశీ వృక్షాలు, పైకస్ జాతి మొక్కలు తమ పరిసరాల్లోని దేశీయ మొక్కల పెరగలేని పరిస్థితిని కల్పిస్తాయని, భూసారాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. అన్యదేశ జాతులకు ఆహార ప్రయోజనం లేనందున ఇవి మితి మీరి పెరుగుతాయని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చి నగరవనంలో పెంచుతున్న వృక్షజాతులను ఈ సందర్భంగా చూపించి వాటి ప్రాకృతిక, ఆర్థిక విలువలను వివరించారు.