అందని ‘ఆసరా’
ABN , First Publish Date - 2021-10-29T06:42:47+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా సంఘాలకు అందాల్సిన రుణమాఫీ నిధులు ఇంకా బ్యాంకు ఖాతాలకు జమకాలేదు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ కోసం డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

- ఇరవై రోజులు కావస్తున్నా సంఘాలకు జమకాని నిధులు
- బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న డ్వాక్రా సంఘాలు
- ఆందోళనలో డ్వాక్రా మహిళలు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా సంఘాలకు అందాల్సిన రుణమాఫీ నిధులు ఇంకా బ్యాంకు ఖాతాలకు జమకాలేదు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ కోసం డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆసరా పథకం నిధుల విడుదలపై ఆర్భాటంగా వారోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించారు. జిల్లా స్థాయిలో పెద్ద చెక్కును విడుదల చేస్తూ ఓ కార్యక్రమం నిర్వహించగా, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతి నిధులు మండల, పట్టణ, గ్రామ స్థాయిల్లో సభలు, సమావేశాలు నిర్వ హించి ఆసరా వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే ఇరవై రోజులు కావస్తున్నా డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ నిధులు ఇంకా జమ కాకపోవడంతో సభ్యులు తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 7వ తేదీన రెండో ఏడాది వైఎస్సార్ ఆసరా నిధులను విడుదల చేశారు. వారం రోజుల్లో సభ్యుల ఖాతాల్లోకి నిధులు జమవు తాయని తెలియజేశారు. అయితే ఇప్పటికీ డ్వాక్రా సంఘాల సభ్యుల రుణమాఫీ నిధులు బ్యాంకు ఖాతాలకు జమకాకపోవడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆసరా పథకం కింద 64,647 డ్వాక్రా సంఘాల్లోని 6,30,637 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ఆసరా పథకం ద్వారా రూ.541.88 కోట్ల నిధులు అర్హత కలిగిన డ్వాక్రా సంఘాల సభ్యు లకు రుణమాఫీ కింద జమ కావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ కొన్ని సం ఘాలకు మాత్రమే నిధులు జమ అయినప్పటికీ అత్యధిక సంఘాలకు మాత్రం ఇంకా బ్యాంకుల్లో సొమ్ములు జమ కావడంలేదు. ముఖ్యంగా బ్యాంకుల్లో పొదుపు ఖాతాలకు రుణమాఫీ సొమ్ము జమ అయితే డ్వాక్రా సంఘాలు ప్రత్యేక తీర్మానాలుచేసి వాటిని బ్యాంకులకు అందిస్తే తప్ప నిధులు విడుదల కావు. ఇందుకోసం బ్యాంకుల్లోని పొదుపు ఖాతాల్లో నిధులు జమ అయిందీ లేనిదీ తెలుసుకునేందుకు సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా డ్వాక్రా సంఘాలకు నిధులు విడుదల చేసి రుణమాఫీ అమ లుకు సహకరించాలని డ్వాక్రా సంఘాల సభ్యులు కోరుతున్నారు.