‘గుండాట ఆడొద్దన్నాడని వెలి వేశారు’

ABN , First Publish Date - 2021-01-20T06:02:06+05:30 IST

గుండాట ఆడొద్దనడంతో తమ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారని కాజులూరుకు చెందిన పెద్దింశెట్టి విష్ణుచక్రం వాపోయాడు.

‘గుండాట ఆడొద్దన్నాడని వెలి వేశారు’

కాజులూరు, జనవరి 19: గుండాట ఆడొద్దనడంతో తమ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారని కాజులూరుకు చెందిన పెద్దింశెట్టి విష్ణుచక్రం వాపోయాడు. దీనికి సంబంధించి అతడు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక ముత్యాలమ్మ వేపచెట్టు సమీపంలోని రామాలయం వద్ద ఈ నెల 15వ తేదీ గుండాట నిర్వహిస్తుండగా అటువైపు వస్తున్న విష్ణుచక్రం కుమారుడు స్నేహితుల్ని గుండాట ఆడవద్దని మందలించి వెళ్లిపోతు న్నాడు. ఆ సమయంలో నిర్వాహకుల్లో ఒకరైన స్థానిక ప్రజాప్రతినిధి తన అనుచరుడితో కలిసి ఘర్షణకు దిగాడు. దీంతో విష్ణుచక్రం కుమారుడు 100 నెంబరుకి ఫోను చేయగా పోలీసులు వచ్చి చెదరగొట్టారు. ఆలయం వద్ద గుండాట ఆడవద్దని చెప్పిన పాపానికి తన కుటుంబాన్ని వెలి వేశారని విష్ణుచక్రం ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై స్థానిక పోలీసులతో పాటు స్పందన, వాట్సాప్‌ ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు.


బైకులో పెట్టిన రూ.3లక్షలు మాయం

కొత్తపేట, జనవరి 19: కొత్తపేట కమ్మిరెడ్డిపాలెంలో బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసి మోటారు సైకిలు కవర్‌లో పెట్టిన రూ.3లక్షల నగదు మాయ మైనట్టు ఎస్‌ఐ ఎల్‌ శ్రీనునాయక్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... వాడపాలేనికి చెందిన లంకలపల్లి వీరబాబు మేనమామ బండారు సుబ్బారావుకు ఆరోగ్యం బాగోలేదు. దీంతో సుబ్బారావు ధాన్యం డబ్బులు తేవాలని సెల్ఫ్‌ చెక్‌ను వీరబాబుకు ఇచ్చాడు. అతడు కొత్తపేట ఆంధ్రాబ్యాంకులో రూ.3 లక్షలు తీసుకుని బైకు కవర్‌లో పెట్టి కొంత దూరం వెళ్లాక తెలిసిన వ్యక్తి కనిపించడంతో ఆగి మాట్లాడాడు. మాటల్లో డబ్బు సంగతి మర్చిపోయాడు. వెనక్కు తిరిగి బండి కవర్లో డబ్బు చూడగా మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు  దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీనునాయక్‌ తెలిపారు. Updated Date - 2021-01-20T06:02:06+05:30 IST