చొక్కాతో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-02-02T05:24:26+05:30 IST
తన చొక్కాతోనే ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కుళ్లిపోయి దుర్వాసన కొడ్తున్న స్థితిలో మృతదేహం
మృతుడు కర్ణాటక మాజీ సీఎం బంధువు సిద్ధార్థసింగ్ హంతకుడు ?
తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 1: తన చొక్కాతోనే ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయి... దుర్వాసన కొడ్తున్న స్థితిలో మృతదేహం లభ్యమైంది. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలే వెల్లడైనట్టు తెలుస్తోంది. వివరాల్లోవెళ్తే... తిరుపతి నగరం శ్రీనివాసం వెనుక తాళ్లపాక చెరువు ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన కొడుతోంది. స్థానికుల సమాచారంతో ఈస్ట్ ఎస్‌ఐ ఇమ్రాన్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రుయాస్పత్రికి తరలించారు. మృతుడు తిరుపతి కొర్లగుంట సంజయ్‌గాంధీకాలనీకి చెందిన చిన్నారెడ్డి కుమారుడు శ్యాంసుందర్‌రెడ్డి (28)గా దర్యాప్తులో గుర్తించారు. వారిని పోలీసులు విచారించగా.. 2014లో బీటెక్ పూర్తిచేసిన శ్యాంసుందర్‌రెడ్డి కొద్దిరోజులు చెన్నై, బెంగళూరుల్లో పలుచోట్ల పనిచేశాడు. కొద్దిరోజులుగా ఖాళీగానే ఉన్న ఇతడు జనవరి 19న తమ స్వస్థలం కడపజిల్లా ఒంటిమిట్టకు వెళుతున్నానని ఇంట్లో చెప్పాడు. ఆ తర్వాత 22వ తేదీన తండ్రి చిన్నారెడ్డికి ఫోన్‌చేసి తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానంటూ బాధపడ్డాడు. 23వ తేదీన కాల్‌చేసి ఉద్యోగం వెతుక్కోడానికి చెన్నైకి వచ్చానని చెప్పాడు. ఆ తరువాత మృతదేహంగానే కనిపించాడని కుటుంబీకులు చెప్పారు. అప్పుల బాధతోనే శ్యాంసుందర్ మృతిచెందాడా లేదా మరేదైనా కారణమా అని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఇమ్రాన్‌బాషా చెప్పారు.
హత్యకేసు భయంతోనే ఆత్మహత్య?
ఇదిలా ఉండగా... కర్ణాటకకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి హత్యకేసుతో సంబంధం ఉండటంవల్లనే శ్యాంసుందర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కర్ణాటక మాజీ సీఎం ధరంసింగ్ బంధువు సిద్ధార్థసింగ్, శ్యాంసుందర్‌రెడ్డి స్నేహితులు. తిరుపతి కొర్లగుంట మారుతీనగర్‌కు చెందిన వినోద్‌కుమార్ కూడా శ్యాంసుందర్‌కు స్నేహితుడు. ఓ స్నేహితుడి కారు తీసుకుని వినోద్‌కుమార్‌ను వెంటబెట్టుకుని శ్యాంసుందర్ జనవరి 19వ తేదీన బెంగళూరుకు వెళ్లి సిద్ధార్థసింగ్‌ను కలిశారు. మరుసటి రోజు ముగ్గురూ కలిసి తిరుపతికి కారులో ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఫూటుగా మద్యం తాగారు. ఈ మద్యం మత్తులో వినోద్‌కుమార్ పడుకుని ఉండిపోయాడు. ఏమైందో ఏమోగాని వినోద్ మార్గమధ్యంలో లేచిచూడగా అప్పటికే సిద్ధార్థసింగ్ కారులోనే హత్యకు గురయ్యాడు. చేసేదిలేక ఇద్దరూ కలిసి మృతదేహాన్ని నెల్లూరుజిల్లా రాపూరు అడవిలో పాతిపెట్టారు. సిద్ధార్థసింగ్ కనిపించకపోవడంతో జనవరి 25వ తేదీన ఆయన కుటుంబసభ్యులు కర్ణాటక అమృతహళ్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు ప్రారంభించారు. ఇదితెలుసుకున్న వినోద్‌కుమార్ తిరుపతి పరిసరాల్లో రైలుకిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో అతడి ఓ చెయ్యి, కాలు విరిగాయి. రుయాలో చికిత్సపొందుతున్న వినోద్‌ను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి కనిపించని శ్యాంసుందర్‌రెడ్డి.. సోమవారం తిరుపతిలో చెట్టుకు ఉరివేసుకుని మృతిచెంది కనిపించాడు. సిద్ధార్థసింగ్ హత్య కేసులో ఏ1 శ్యాంసుందర్‌రెడ్డి కాగా, ఏ2 వినోద్‌కుమార్‌గా తెలుస్తోంది. హత్యకేసు భయంతోనే ఇతడు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.