ఎస్వీయూలో 10 నుంచి యూత్ ఫెస్టివల్
ABN , First Publish Date - 2021-12-31T07:54:45+05:30 IST
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జనవరి 10వ తేదీ నుంచి యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 30: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జనవరి 10వ తేదీ నుంచి యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్‌ను మూడ్రోజులపాటు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రచార వాల్‌పోస్టర్‌ను ఎస్వీయూ వీసీ రాజారెడ్డి గురువారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెట్విన్, సాయి ద్వారక విద్యాసంస్థల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా గాత్రం, నృత్యం, చిత్రలేఖనం, వక్తృత్వం, ఫొటోగ్రఫీ, క్విజ్ వంటి అంశాల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. యూనివర్సిటీ, అనుబంధ కాలేజీ విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్న యువత ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. పాలకమండలి సభ్యుడు డాక్టర్ చింతల ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ.. ఫెస్టివల్ విజయవంతానికి తమ వంతు తోడ్పాటును అందిస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు.. 73370 30956 నెంబరుకు ఫోన్ చేయాలని సెట్విన్ ప్రతినిధి మురళీకృష్ణ కోరారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.