మహిళా సాధికార కేతనం

ABN , First Publish Date - 2021-08-25T06:50:30+05:30 IST

మహిళలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ.. వారిని సాధికారత వైపు నడిపిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తన ఖ్యాతిని ఇనుమడింప చేసుకుంటోంది.

మహిళా సాధికార కేతనం
స్నాతకోత్సవానికి సిద్ధమైన ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం

 నేడు పద్మావతీ వర్సిటీ 18వ స్నాతకోత్సవం

ప్రముఖ రచయిత్రి ఓల్గాకు గౌరవ డాక్టరేట్‌

 రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సురేష్‌ రాక


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఆగస్టు 23: మహిళలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ.. వారిని సాధికారత వైపు నడిపిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తన ఖ్యాతిని ఇనుమడింప చేసుకుంటోంది. మహిళా సాధికారత సాధించాలనే లక్ష్యంతో 1983 ఏప్రిల్‌ 14న నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. మూడు దశాబ్దాలకు పైగా బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో వర్సిటీ విశేష కృషి చేసింది. ఈ క్రమంలో 18వ స్నాతకోత్సవాన్ని బుధవారం ఉదయం 10 గంటలకు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కులపతి హోదాలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌గా ప్రసంగం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ హాజరు కానున్నారు. ఈ స్నాతకోత్సవంలో 3054 మందికి డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ డిగ్రీలను, వీరిలో 150 మందికిపైగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బంగారు పతకాలు పతకాలను ప్రకటిస్తారు. కాగా, స్నాతకోత్సవానికి పీహెచ్‌డీ చేసిన 150 మందిని మాత్రమే ఆహ్వానించారు. వీరికి మాత్రమే నేరుగా డిగ్రీలను అందించనున్నారు. స్నాతకోత్సవ ఏర్పాట్లను వీసీ ప్రొఫెసర్‌ దువ్వూరి జమున పర్యవేక్షించారు. స్నాతకోత్సవ నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా, కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు. 


స్నాతకోపన్యాసం చేయనున్న ఓల్గా

ఈ స్నాతకోత్సవంలో ప్రముఖ రచయిత్రి ఓల్గా (పోపూరి లలిత కుమారి)కు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ అందించనుంది. ఈమె వర్చువల్‌గా పాల్గొని స్నాతకోపన్యాసం చేయనున్నారు. రష్యాలో ప్రవహించే ఓల్గా నదిని తన కలం పేరుగా పెట్టుకున్న ఈమె..  మహిళలను చైతన్యం చేసే సాహిత్యాన్ని వివిధ ప్రక్రియల ద్వారా సృజించారు. మహిళా సమస్యలపై గళం విప్పడంతో పాటు సాహిత్య రంగంలోనూ ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌ ప్రకటించారు. గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లెకి చెందిన ఓల్గా, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. తెనాలిలోని వీఎస్‌ఆర్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు. చలం, కొడవటిగంటి కుటుంబరావు రచనలకు ప్రభావితమై అనేక స్త్రీవాద రచనలు చేశారు. ఈమె రాసిన స్వేచ్ఛ నవల పలు భారతీయ భాషల్లోకి అనువాదమైంది. అస్మిత అనే సంస్థ అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా పని చేసిన ఓల్గా అనేక మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈమె రాసిన 12 రచనలను అమెరికన్‌ లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌ తన జాబితాలో పొందుపర్చింది. ‘ఆకాశంలో సగం’ అనే నవల, రాజకీయ కథలు, విముక్త కథలు సంచలనం రేకెత్తించాయి. 1993లో ఓల్గా సంపాదకత్వంలో వెలువడిన నీలి మేఘాలు కవితా సంకలనం స్త్రీవాద చైతన్యాన్ని కలిగించింది. 1998లో ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డు.. 1999లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ స్త్రీవాద రచయిత్రి పురస్కారం.. 2014లో లోక్‌ నాయక్‌ ఫౌండేషన్‌ నుంచి సాహిత్య పురస్కారాలను అందుకున్నారు. ఓల్గా రాసిన విముక్త కథల సంపుటికి 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

Updated Date - 2021-08-25T06:50:30+05:30 IST