కుమార్తెకు విషమిచ్చి...తానూ తాగి తల్లి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-01-13T04:58:28+05:30 IST
దివ్యాంగురాలైన కుమార్తెకు సేవలు చేయలేక, అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు వైద్యం అందించలేక జీవితం మీద విరక్తి చెందిన ఓ తల్లి కుమార్తెకు క్రిమిసంహారక మందుతాపించి, తానూ తాగి ఆత్మహత్యకు యత్నించింది.

కుమార్తె మృతి.. తల్లి పరిస్థితి విషమం
మదనపల్లె క్రైం, జనవరి 12: దివ్యాంగురాలైన కుమార్తెకు సేవలు చేయలేక, అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు వైద్యం అందించలేక జీవితం మీద విరక్తి చెందిన ఓ తల్లి కుమార్తెకు క్రిమిసంహారక మందుతాపించి, తానూ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఇందులో కుమార్తె మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతికి రెఫర్ చేశారు. ఈ విషాదకర ఘటన మంగళవారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. కురబలకోట మండలం ఎర్రబల్లెకు చెందిన ఎం.మారపరెడ్డి విశ్రాంత మిలటరీ ఉద్యోగి. ఈయనకు భార్య సరస్వతమ్మ, నలుగురు కుమార్తెలున్నారు. నాలుగో కుమార్తె హేమలత(30)పుట్టుకతోనే దివ్యాంగురాలు. కన్నతల్లే ఈమెకు సపర్యలూ చేస్తోంది. పైగా మారపరెడ్డి కూడా ఇటీవల అనారోగ్యం బారినపడ్డాడు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన సరస్వతమ్మ తొలుత కుమార్తెకు క్రిమిసంహారక మందుతాపించి, ఆ తరువాత తానూ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఇంట్లో వాంతులు చేసుకుంటున్న తల్లీకూతుళ్లను గుర్తించిన స్థానికులు 108 వాహనంలో మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలో హేమలత మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరణ చేశారు. కాగా సరస్వతమ్మ(65)పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతికి రెఫర్ చేశారు. ఈ మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
