వాక్సిన్‌ లేకుండా నీరసపడ్డ టీకా ఉత్సవ్‌

ABN , First Publish Date - 2021-04-13T05:46:18+05:30 IST

జిల్లాలో మొదటి డోసు వ్యాక్సిన్‌ వేసుకుని రెండో డోసు కోసం 54 వేల మంది ఎదురు చూస్తున్నారు. వారంతా రెండో డోసు కోసం ప్రతి రోజూ ఆయా వ్యాక్సినేషన్‌ కేంద్రాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. ఎప్పుడొచ్చినా నోస్టాక్‌ బోర్డు ఉండడం.. లేదా కేంద్రం మూసి ఉండడంతో వారంతా భయాందోళనతో వెనుతిరుగుతున్నారు.

వాక్సిన్‌ లేకుండా  నీరసపడ్డ టీకా ఉత్సవ్‌
25వ వార్డు సచివాలయంలో వ్యాక్సిన్‌ కోసం రిజిస్ర్టేషన్‌ చేసుకుంటున్న ప్రజలు

మూడు రోజులు రద్దు

రేపు ఒక్కరోజే 60 వేల డోసులని ప్రకటన


చిత్తూరు, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొదటి డోసు వ్యాక్సిన్‌ వేసుకుని రెండో డోసు కోసం 54 వేల మంది ఎదురు చూస్తున్నారు. వారంతా రెండో డోసు కోసం ప్రతి రోజూ ఆయా వ్యాక్సినేషన్‌ కేంద్రాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. ఎప్పుడొచ్చినా నోస్టాక్‌ బోర్డు ఉండడం.. లేదా కేంద్రం మూసి ఉండడంతో వారంతా భయాందోళనతో వెనుతిరుగుతున్నారు. టీకా ఉత్సవ్‌ పేరిట ప్రభుత్వం పెద్దఎత్తున వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా.. జిల్లాలో స్టాక్‌ లేకపోవడంతో ఈ కార్యక్రమం పూర్తిగా విఫలమైంది. ఈ నెల 11నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఉద్యమంలా వ్యాక్సిన్‌లను పంపిణీ చేయాలనుకున్నారు. తొలి రెండు రోజులు ఆది, సోమవారాల్లో స్టాక్‌ కొరత కారణంగా వ్యాక్సిన్‌ వేయలేదు. ప్రస్తుతం జిల్లాలో స్టాక్‌ లేకపోవడంతో మూడో రోజు, మంగళవారం కూడా వ్యాక్సిన్‌ వేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అధికారులు నాలుగు రోజులు జరగాల్సిన టీకా ఉత్సవ్‌ కార్యక్రమాన్ని ఒక్క రోజుకు కుదించారు. ఈ నెల 14వ తేదీ, అంటే రేపు ఒక్కరోజే 60 వేల డోసుల వ్యాక్సిన్‌ ప్రజలకు అందించి ఉత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ ఒక్క రోజే 129 వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో, 500 చొప్పున వ్యాక్సిన్‌లు వేసేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు అంటున్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచే ఆయా కేంద్రాల వద్ద వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతుందని, వ్యాక్సిన్‌ ముగిసే వరకు కార్యక్రమం నడుస్తుందని అధికారులు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. 45 ఏళ్లు పైబడినవారు, రెండో డోసు కోసం వేచి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో పెంచలయ్య అంటున్నారు. రెండో రోజు సోమవారం చిత్తూరు, మదనపల్లె, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తి వంటి ప్రాంతాల్లోని కొన్ని సచివాయాలయాల్లో మాత్రమే, జిల్లా వ్యాప్తంగా 5 వేల డోసుల వ్యాక్సిన్‌ వేశారు. ప్రస్తుతం ఎక్కడా ఒక్క డోసు స్టాక్‌ కూడా లేదు. దీంతో మంగళవారం కూడా వ్యాక్సిన్‌ వేసే పరిస్థితి కనిపించడం లేదు.



Updated Date - 2021-04-13T05:46:18+05:30 IST