ఓటీఎ్‌సను వ్యతిరేకిస్తున్నాం
ABN , First Publish Date - 2021-12-30T05:56:53+05:30 IST
ఓటీఎస్ పథకాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని టీడీపీ కౌన్సిలర్లు పి.తులసి, ఆర్.గీతశ్రీ ప్రకటించారు.

మదనపల్లె కౌన్సిల్ సమావేశంలో టీడీపీ సభ్యుల ప్రకటన
వైసీపీ సభ్యుల మూకుమ్మడి మాటలదాడి
మదనపల్లె, డిసెంబరు 29: ఓటీఎస్ పథకాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని టీడీపీ కౌన్సిలర్లు పి.తులసి, ఆర్.గీతశ్రీ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించకుండా, తమ ప్రభుత్వంలో మంజూరై పూర్తయిన ఇళ్లకు బిల్లులు చెల్లించకుండా పేదల నుంచి ఓటీఎస్ పేరుతో గ్రామాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.15వేలు ఎలా వసూలు చేస్తారంటూ వారు ప్రశ్నించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వి.మనూజ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సాధారణ, బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో ప్రజలపై వేస్తున్న అదనపు భారాన్ని వ్యతిరేకించారు. ఓటీఎస్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ అంశంపై వైసీపీ కౌన్సిలర్లు తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ కౌన్సిలర్లపై మాటల యుద్ధానికి దిగారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు గృహరుణాలపై వడ్డీ కూడా మాపీ చేయలేదన్నారు. కేవలం ఇద్దరు సభ్యులున్న టీడీపీ ఓటీఎస్ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ పేదలకు పక్కా ఇళ్లపై సంపూర్ణ హక్కు కల్పిస్తున్నారని, దీన్ని ఓర్వలేకే టీడీపీ రాద్దాంతం చేస్తోందన్నారు. ఇలాంటి పథకంపై మరోసారి మాట్లాడితే టీడీపీ సభ్యులను ఇకపై కౌన్సిల్‌లో అడుగుపెట్టనీయమంటూ మున్సిపల్ వైస్‌చైర్మన్ జింకా వెంకటాచలపతి, కౌన్సిలర్లు బి.ఎ.ఖాజా, ప్రసాద్‌బాబు, ఆర్.శివయ్య, వశీంఅక్రం, పాల్ చంద్రశేఖర్, తదితరులు హెచ్చరించారు. ప్రతిపక్ష సభ్యులు, ప్రభుత్వ పథకాలను విమర్శించవచ్చని, అయితే తాము ఇచ్చే వివరణను వినకుండా ఏకపక్షంగా సమావేశం నుంచి వెళ్లిపోవడం ఏంటని వైస్‌చైర్మన్ జింకా ప్రశ్నించారు. వారి తీరు చూస్తే, మేమూ ఉన్నాము అన్నట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు.