శ్రీకాళహస్తి పైప్స్ పరిరక్షణకు పోరాటం: సీఐటీయూ
ABN , First Publish Date - 2021-03-21T07:23:35+05:30 IST
వేలమందికి ఉపాధి కల్పించే శ్రీకాళహస్తి పైప్స్ పరిశ్రమను మూత వేయించడం దారుణమని సీఐటీయూ నేత కందారపు మురళి వాపోయారు.

శ్రీకాళహస్తి, మార్చి 20: వేలమందికి ఉపాధి కల్పించే శ్రీకాళహస్తి పైప్స్ పరిశ్రమను పదిరోజులపాటు మూత వేయించడం దారుణమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. ఈ విషయమై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి స్పందించి సీఐటీయూ బృందం శనివారం ఫ్యాక్టరీని సందర్శించింది. మురళీతోపాటు పుల్లయ్య, నాగరాజు, యాదగిరి, గంధం మణి, బాలకృష్ణ, రంగయ్య తొలుత స్థానిక ప్రజలతో చర్చించాక పరిశ్రమ ఉపాధ్యక్షుడు కమలాకర్, సీనియర్ జనరల్ మేనేజర్ దొరైరాజు, సీనియర్ మేనేజర్ విశ్వనాధరాజులను కలిశారు. ఈ సందర్భంగా కర్మాగారంలో చోటుచేసుకున్న సమస్యల గురించి చర్చించారు. శ్రీకాళహస్తి పైప్స్ పరిశ్రమను అధికార పార్టీ జులుం నుంచి కాపాడాలని కోరారు. ఐదుగురు కార్మికులకు అన్యాయం జరిగిందనే కారణంతో మొత్తం పరిశ్రమను స్తంభింపజేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాక్‌మెన్ కంపెనీలో ఏకంగా 250 మంది ఉద్యోగులను తొలగిస్తే స్పందించని అధికార పార్టీ నాయకులు ఈ విషయంలో ఎందుకు అత్యుత్యాహం చూపిస్తున్నారని నిలదీశారు.యూనియన్లను రద్దు చేసి అధికార పార్టీకి చెందిన యూనియన్‌లో చేరాలని కార్మికులపై ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసమన్నారు. కార్మికులు కూడా వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని కోరారు. సీఐటీయూ నాయకుడు అమర్‌నాధ్ తదితరులు పాల్గొన్నారు.