వలంటీర్ ఆత్మహత్య కేసులో కానిస్టేబుల్‌కు రిమాండ్
ABN , First Publish Date - 2021-12-09T07:47:13+05:30 IST
వలంటీరు ఆత్మహత్య కేసులో ఓ కానిస్టేబుల్‌కు రిమాండ్ విధిస్తూ శ్రీకాళహస్తి కోర్టు ఆదేశాలిచ్చింది.

శ్రీకాళహస్తి, డిసెంబరు 8: వలంటీరు ఆత్మహత్య కేసులో ఓ కానిస్టేబుల్‌కు రిమాండ్ విధిస్తూ శ్రీకాళహస్తి కోర్టు ఆదేశాలిచ్చింది. పోలీసు వివరాల మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం దక్షిణకైలాస్‌నగర్‌కు చెందిన ఉమామహేశ్వరి వలంటీర్‌గా పనిచేస్తోంది. కాగా, ప్రేమ పేరిట కానిస్టేబుల్ ప్రసాద్ మోసం చేశాడంటూ ఈనెల 2వతేది ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై మృతురాలి తండ్రి సాంబశివరావు ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ ప్రసాద్, మరో ముగ్గురు కుటుంబసభ్యులపై రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఉమామహేశ్వరి చనిపోయే ముందుగా తన డైరీలో రాసిన సూసైడ్ నోట్‌ను ఆమె తల్లిదండ్రులు గుర్తించి మంగళవారం పోలీసులకు అందజేశారు. ఇందులో తన మృతికి మొత్తం ఏడుగురు కారణమైనట్లు వలంటీర్ పేర్కొంది. ఆ మేరకు.. టూటౌన్ సీఐ భాస్కర్ నాయక్ మరో ముగ్గరిపైనా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం పట్టణ శివారులో ఉన్న కానిస్టేబుల్ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం శ్రీకాళహస్తి కోర్టుకు తరలించగా, 15 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలివ్వడంతో పీలేరు సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.