లాడ్జిలో వెంకటాపురంవాసి మృతి
ABN , First Publish Date - 2021-10-21T07:08:11+05:30 IST
తిరుపతి నగరం వివేకానంద కూడలివద్ద నున్న ఓ లాడ్జిలో ఓ వ్యక్తి బుధవారం మృతిచెందారు.

అనారోగ్యంతోనే చనిపోయాడన్న పోలీసులు
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 20: తిరుపతి నగరం వివేకానంద కూడలివద్ద నున్న ఓ లాడ్జిలో ఓ వ్యక్తి బుధవారం మృతిచెందారు. అలిపిరి ఎస్ఐ జయచంద్ర తెలిపిన ప్రకారం.. గంగాధర నెల్లూరు మండలం కలిజవేడు పంచాయతీ వెంకటాపురానికి చెందిన వినోద్‌కుమార్ (40) ఈనెల 19వ తేదీ ఉదయం లాడ్జిలో గది తీసుకున్నారు. స్విమ్స్‌లో వైద్యం కోసం వచ్చినట్టు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఆయనకు లాడ్జి సిబ్బంది హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చారు. బుధవారం ఉదయం నుంచి ఆయన గది తలుపులు తెరిచి ఉండటంతో 10 గంటల సమయంలో సిబ్బంది గదిలోకి వెళ్లి చూశారు. బెడ్‌పై ఓ చివరగా ఆయన బోర్లా పడుకుని ఉండటంతో లేపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన మృతిచెందినట్టు గుర్తించిన సిబ్బంది అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలిపిరి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వద్దనున్న సెల్‌ఫోన్, ఆధార్ కార్డు ఆధారంగా ఆయన కుటుంబీకులకు సమాచారం అందించారు. లాడ్జిలోని సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. అనుమానాస్పద పరిస్థితులు లేవని నిర్ధారించుకున్నారు. అనారోగ్యంతోనే మృతిచెందినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ వైద్య కళాశాలకు తరలించి.. ఎస్ఐ జయచంద్ర కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.