వాహనాల లైఫ్‌, గ్రీన్‌ ట్యాక్స్‌ పెంపు

ABN , First Publish Date - 2021-12-30T07:12:18+05:30 IST

వాహనాల లైఫ్‌, గ్రీన్‌ ట్యాక్స్‌ జనవరి ఒకటో తేదీ నుంచి పెరగనున్నట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ (డీటీసీ) బసిరెడ్డి తెలిపారు.

వాహనాల లైఫ్‌, గ్రీన్‌ ట్యాక్స్‌ పెంపు
మీడియాతో మాట్లాడుతున్న బసిరెడ్డి

ఒకటి నుంచి అమల్లోకి : డీటీసీ

తిరుపతి(రవాణా), డిసెంబరు 29: వాహనాల లైఫ్‌, గ్రీన్‌ ట్యాక్స్‌ జనవరి ఒకటో తేదీ నుంచి పెరగనున్నట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ (డీటీసీ) బసిరెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి ఆర్టీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 


టూవీలర్లకు.. 

రూ.50వేలలోపున్న నూతన వాహనానికి తొమ్మిది శాతం, రూ.50వేలు దాటితే 12శాతం లైఫ్‌ట్యాక్స్‌ చెల్లించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన వాటికి సంవత్సరాల వారీగా లైఫ్‌ ట్యాక్స్‌ నిర్ణయించడం జరిగిందన్నారు. రూ.50వేలలోపు వాహనం కొనుగోలు చేస్తే.. 2-11 ఏళ్లవరకు ఉంటే.. 8నుంచి ఒక శాతం వరకు, రూ.50వేలు దాటితే 11నుంచి 4శాతం వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 


కార్లకు.. 

రూ.5లక్షల్లోపున్న నూతన వాహనానికి 13శాతం, 5నుంచి 10లక్షల వరకు ఉన్నవాటికి 14శాతం, 10నుంచి 20లక్షల వరకు ఉన్నవాటికి 17శాతం, 20లక్షలపైన వాహనాలకు 18శాతం లైఫ్‌ట్యాక్స్‌ చెల్లించారన్నారు. అలాగే వైట్‌ అండ్‌ ఎల్లో బోర్డులు కలిగి, ఏడు సీట్ల సామర్థ్యం ఉన్న వాహనాల వరకు మాత్రమే ఈ లైఫ్‌ ట్యాక్స్‌ వర్తిస్తుందన్నారు. అదనంగా సీట్లున్న వాటికి అదనపు చెల్లింపులు చేయాలన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన వాహనాలకు సంవత్సరాల వారీగా లైఫ్‌ ట్యాక్స్‌ను విభజించడం జరిగిందని చెప్పారు. రూ.5లక్షల్లోపు 2-12 ఏళ్లలోపు కొనుగోలు చేసిన వాహనాలకు 12 నుంచి 6.5శాతం వరకు, రూ.5-10లక్షల్లోపు వాటికి 13నుంచి 7.5శాతం, రూ.10-20లక్షల పైబడిన వాటికి 17నుంచి 11.5శాతం లైఫ్‌ట్యాక్స్‌ చెల్లించాలని వివరించారు. గతంలో పదిలక్షల్లోపు వాహనాలకు 12శాతం, అంతకన్నా దాటిన వాటికి 14శాతం మాత్రమే చెల్లించేవారన్నారు. 


గ్రీన్‌ ట్యాక్స్‌ ఇలా..

సాధారణంగా వాహనం కొనుగోలు చేశాక ఏడేళ్లు దాటితేనే గ్రీన్‌టాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు మాత్రం ఏడు-పదేళ్లలోపుంటే క్వార్టర్లీ ట్యాక్స్‌లో సగం చెల్లించాల్సి ఉంటుంది. 10-12 ఏళ్లలోపు వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్‌ చెల్లించాలని, 12 ఏళ్లు పైబడిన వాహనాలకు అదనంగా గ్రీన్‌ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అగ్రికల్చర్‌ ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఉంటుందన్నారు. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు సంబంధించి 8నుంచి 13సీట్ల సామర్థ్యం కలిగిన వాహనాలకు ఏడాదికి నాలుగు వేల నుంచి ఆరువేల రూపాయల వరకు చెల్లించాలన్నారు. నాన్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాలకు మోటర్‌ సైకిల్‌కు 15-20 ఏళ్లలోపున్నవాటికి ఐదు సంవత్సరాల కాలపరిమితికి రూ.రెండువేల చెల్లించాలని, 20 ఏళ్లు దాటిన వాహనానికి ఐదు సంవత్సరాల కాలపరిమితికి రూ.ఐదువేల గ్రీన్‌ టాక్స్‌ చెల్లించాలన్నారు. వైట్‌ బోర్డ్‌ కార్లకు సంబంధించి 15-20 ఏళ్లలోపుంటే ఐదేళ్ల కాలపరిమితికి రూ.5వేలు, 20 ఏళ్లు దాటితే ఐదు సంవత్సరాల కాలపరిమితికి రూ.10వేల గ్రీన్‌ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఆర్టీవో సీతారామిరరెడ్డి, ఎంవీఐ టీఎన్‌ మురళి పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T07:12:18+05:30 IST