వరలక్ష్మీ వ్రతం ఎఫెక్ట్‌.. కిలో కనకాంబరాలు రూ.1500

ABN , First Publish Date - 2021-08-20T06:00:37+05:30 IST

శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఉండటంతో పట్టణంలోని బెంగళూరు బస్టాండు పూలమార్కెట్‌లో ధరలు ఆకాశాన్నంటాయి.

వరలక్ష్మీ వ్రతం ఎఫెక్ట్‌.. కిలో కనకాంబరాలు రూ.1500
బెంగళూరు బస్టాండు పూలమార్కెట్‌లో రద్దీగా ఉన్న జనం

మదనపల్లె రూరల్‌, ఆగస్టు 19:  శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఉండటంతో పట్టణంలోని బెంగళూరు బస్టాండు పూలమార్కెట్‌లో ధరలు ఆకాశాన్నంటాయి. గురువారం ఉదయమే మార్కెట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు రకరకాల పూలు తీసుకువచ్చారు. పట్టణంలో కొనుగోలుదారులు సైతం పెద్దసంఖ్యలో మార్కెట్‌కు రావడంతో ఆ ప్రాంతమంతా జనంతో కిటకిటలాడింది. కాగా కిలో కనకాంబరాల ధర రూ.1500 పలుకగా, సన్నమల్లెపూలు కిలో రూ.1200, రోజాలు కిలో రూ.200, చామంతులు కిలో రూ.80, చెండుమల్లెలు కిలో రూ.40, మొగలిపువ్వు ఒకటి రూ.200 పలికాయి. అదేవిధంగా పూజకు అవసరమయ్యే డేరాపూలు, ధవనం, పండ్లు కొనుగోలు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టణంలోకి వచ్చారు. దీంతో బెంగళూరు బస్టాండ్‌, చిత్తూరు బస్టాండు సర్కిల్‌, నెహ్రూబజార్‌ రద్దీగా మారాయి. పలుమార్లు ట్రాఫిక్‌ జామ్‌ కాగా పోలీసులు క్రమబద్ధీకరించారు.

Updated Date - 2021-08-20T06:00:37+05:30 IST