విజయవంతంగా ‘వైకుంఠ’ ద్వార దర్శనాలు

ABN , First Publish Date - 2021-01-05T05:22:42+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందికి టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

విజయవంతంగా ‘వైకుంఠ’ ద్వార దర్శనాలు
మీడియాతో మాట్లాడుతున్న టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

టీటీడీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన ఈవో 

నేటి నుంచి పాపవినాశనంకు అనుమతి


తిరుమల, జనవరి4 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందికి టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం సాయంత్రం ఆయన అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టితో కలిసి మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా ప్రవేశపెట్టిన పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తిచేశామన్నారు. డిసెంబరు 25 నుంచి జనవరి3వ తేదీ వరకు 4.26 లక్షల మందికి శ్రీవారి దర్శనం చేయించామన్నారు. వీరిలో రూ.300 దర్శనం భక్తులు 1.83 లక్షలు, సర్వదర్శనం 90,852, శ్రీవాణి దాతలు 10,725, ఇతర ట్రస్టు దాతలు 4,797, ఆన్‌లైన్‌ ఆర్జితసేవ భక్తులు 38,229 మంది ఉన్నారన్నారు. వీరి ద్వారా రూ.29.09 కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు చెప్పారు. 90 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 4.52 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించగా, 20.05 లక్షల లడ్డూలను అందించామన్నారు. గదుల కేటాయింపు ద్వారా రూ.2.27 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. వ్యాక్సిన్‌ వేసేవరకు శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలు ప్రారంభించలేమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కరోనా పరిస్థితలకు అనుగుణంగా భక్తుల సంఖ్య పెంపుపై ఆలోచిస్తామన్నారు. ద్వాదశి రోజున శ్రీవాణి ట్రస్టు భక్తుల్లో ఐదారుగురు వల్ల కొంత సమస్య వచ్చిందని, వారికి పరిస్థితి వివరించడంతో రాతపూర్వకంగా క్షమాపణ పత్రాన్ని రాసిచ్చారని వివరించారు. నిత్యం భక్తుల మధ్య విధులు నిర్వహించే టీటీడీ సిబ్బందిని సెకండ్‌ ఫ్రెంట్‌లైన్‌ కరోనా వారియర్స్‌ జాబితాలో చేర్చి వ్యాక్సిన్‌ వేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కాగా, కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా మార్చిలో రద్దు చేసిన పాపవినాశనం, శ్రీవారిపాదాల సందర్శనాన్ని తిరిగి మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్టు ఈవో జవహర్‌రెడ్డి చెప్పారు. 


టీటీడీ ఆలయాలకు పటిష్ఠ భద్రత 


టీటీడీ పరిధిలోని 50 ఆలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి తెలిపారు. 41 ఆలయాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మిగిలిన తొమ్మిదింట్లో 15వ తేదీనాటికి పూర్తిచేస్తామన్నారు. రథాల వద్ద కూడా ప్రత్యేక నిఘా ఉంచామని ఓ ప్రశ్నకు సమాధానంగా  చెప్పారు. 

Updated Date - 2021-01-05T05:22:42+05:30 IST