అభాసుపాలు!

ABN , First Publish Date - 2021-12-19T06:55:19+05:30 IST

కొంతమంది మహిళలకు డ్వాక్రా సమావేశం అన్నారు.మరి కొంతమందిని సభకు హాజరు కాకపోతే వెయ్యి రూపాయలు కట్‌ చేస్తామని ఆర్పీలతో బెదిరించారు.దీంతో చేసేదిలేక ‘అభివృద్ధి వికేంద్రీకరణ-రాయలసీమ మనోగతం’ పేరిట శనివారం తిరుపతి ఇందిరా మైదానంలో నిర్వహించిన సభకు మహిళలు బలవంతంగా హాజరుకావాల్సి వచ్చింది.

అభాసుపాలు!
సభ ప్రారంభంలో జన కళ...,

‘అభివృద్ధి వికేంద్రీకరణ-రాయలసీమ మనోగతం’ సభలో విశేషాలెన్నెన్నో


జనాన్ని రప్పించడం నుంచీ సభ ముగిసేవరకూ ఆసక్తికర దృశ్యాలు


జన సమీకరణను పర్యవేక్షించిన కార్పొరేషన్‌లో ఓ ముఖ్య అధికారి


వక్తల ప్రసంగాలు ముగియకనే  ఇంటిదారి పట్టిన డ్వాక్రా మహిళలు


అడ్డుకున్న పోలీసులపై ఆగ్రహావేశాలు


ఇందిరా మైదానంలో సభ జరగబోతోంది. ప్రతి సభ్యురాలు రావాలి. రాయలసీమలో హైకోర్టు పెట్టాలి. దానివలన ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయి. అందరూ మద్దతు పలకాలి. లేనిపక్షంలో వెయ్యి జరిమానా వేసి ఆ డబ్బులతో వేరేవాళ్లను తీసుకెళ్లాల్సి వస్తుంది

- ఇది పొదుపు మహిళా సంఘాలకు మెప్మాకు చెందిన ఓ రిసోర్స్‌ పర్సన్‌ ఆదేశం


‘కాలేజీ కోసమని బస్సెక్కితే మీటింగు జరిగే చోటకు తీసుకొచ్చేశారు. ఇక్కడికి వచ్చేవరకు తెలియదు. మూడు రాజధానుల కోసం జరుగుతున్న సమావేశమని 

- ఇది సభకు వచ్చిన పలువురు విద్యార్థుల మాట


తిరుపతి సిటీ/తిరుపతి(విద్య)/తిరుపతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కొంతమంది మహిళలకు డ్వాక్రా సమావేశం అన్నారు.మరి కొంతమందిని సభకు హాజరు కాకపోతే వెయ్యి రూపాయలు కట్‌ చేస్తామని ఆర్పీలతో బెదిరించారు.దీంతో చేసేదిలేక ‘అభివృద్ధి వికేంద్రీకరణ-రాయలసీమ మనోగతం’ పేరిట శనివారం తిరుపతి ఇందిరా మైదానంలో నిర్వహించిన సభకు మహిళలు బలవంతంగా హాజరుకావాల్సి వచ్చింది. సభాప్రాంగణం బయట ఆయా సంఘాలకు సంబంధించిన ఆర్పీలు ఎవరు వచ్చారో, ఎవరు రాలేదో తెలుసుకోవడం కనిపించింది.ఈ ప్రక్రియనంతా సమన్వయపరుస్తూ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఓ ముఖ్య అధికారి సభా పరిసర ప్రాంతాల్లో కలియదిరిగారు. సభ 10గంటలకైౖతే ఉదయం 9 గంటలకే సభాస్థలి వద్దకు మహిళలను, విద్యార్థులను తరలించారు. మైదానంలో షామియానా వేయకపోవడం, ఎండ చురుగ్గా కాస్తుండడంతో అరగంట తర్వాత మహిళల ఓపిక నశించింది.సభలో ప్రసంగాలు కొనసాగుతుండగానే చాలామంది మహిళలు వెనుదిరిగేందుకు ప్రయత్నించారు.అక్కడే ఉన్న మహిళా సంఘాలనేతలు  కొంతసమయం సభలో ఉండాలని, వచ్చిన వారికి అటెండెన్స్‌ వేస్తామని వారించినా లెక్కచేయకుండా బయటకు వెళ్లిపోబోగా పోలీసులు గేట్లను తాళ్లతో కట్టేసి కాపలాగా నిలబడ్డారు.పనులున్నాయని...వెళ్లిపోవాలని ఎంత బతిమాలినా మహిళలను పోలీసులు బయటకు పంపలేదు. దీంతో గేట్లు దూకి, గోడలు దాటుకుని పలువురు వెళ్లిపోవడం కనిపించింది.కొందరు మహిళలు పోలీసులను గట్టిగా నిలదీయడంతో అక్కడనుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఇదంతా చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను నిర్వాహకులు దుర్భాషలాడారు. కొందరి ఫోన్లు లాక్కుని ఫొటోలను,వీడియాలను బలవంతంగా డిలీట్‌ చేయించారు. దీంతో సమావేశం జరుగుతుండగానే సభా ప్రాంగణం చాలా వరకూ ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది.




రాయలసీమ సమగ్రాభివృద్ధి వికేంద్రీకరణతోనే:ప్రముఖుల వాణి 


తిరుపతి రూరల్‌, డిసెంబరు 18: రాష్ట్రప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు ప్రముఖులు అభిప్రాయ పడ్డారు. రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ’అభివృద్ధి వికేంద్రీకరణ - రాయలసీమ మనోగతం’ పేరుతో తిరుపతిలోని తుడా మైదానంలో శనివారం నిర్వహించిన సభలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ వాదన విన్పించారు. రాజధానిగా అమరావతి ఒక్కటే సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు.రాయలసీమ అధ్యయనాల సంస్థ కన్వీనర్‌ భూమన్‌ మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమం అన్ని విధాలా అనైతికమన్నారు. త్వరలో రాయలసీమ సమస్యలపై పాదయాత్ర చేపడతామన్నారు.తిరుపతి కేంద్రంగా నిరాహార దీక్షలూ చేపడతామని ప్రకటించారు.సభాధ్యక్షుడు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్‌ పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినప్పుడే రాయలసీమలోని ప్రజా సంఘాలు అభ్యంతరం తెలిపాయన్నారు.అభివృద్ధిలో వెనకబడ్డ రాయలసీమ,ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.రాయలసీమ కార్మిక, కర్షక సంఘం అధ్యక్షుడు సీహెచ్‌ చంద్రశేఖర రెడ్డి  మాట్లాడుతూ శాసన రాజధానిగా కూడా అమరావతి పనికిరాదన్నారు.హైకోర్టుతో పాటు  రాజధానీ రాయలసీమకే కావాలని డిమాండ్‌ చేశారు.రాయలసీమ మహాసభ అధ్యక్షుడు శాంతి నారాయణ మాట్లాడుతూ న్యాయ రాజధాని కూడా రాయలసీమకు వద్దనడం అన్యాయమని తెలిపారు. ఇప్పటికైనా రాయలసీమవాసులు మేలుకోకపోతే తిరుమల వెంకన్నను కూడా అమరావతికి తీసుకెళతారని హెచ్చరించారు. రాయలసీమలో పుట్టి సొంత ప్రాంతానికి అన్యాయం చేస్తున్న పార్టీలను, నాయకులను ప్రజలు నిలదీయాలని కోరారు.రచయిత బండి నారాయణస్వామి మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, అమరావతి ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి వికేంద్రీకరణ విధానమే సరైనదని స్పష్టం చేశారు.అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపిన పార్టీలు, నాయకులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. రాయలసీమ నీటి అధ్యయన వేదిక కన్వీనర్‌ శ్రీకంఠా రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమకు రావాల్సిన కంపెనీలను అమరావతికి తీసుకెళ్లారని ఆరోపించారు. పద్మావతి మెడికల్‌ కాలేజీ సీట్ల భర్తీలోనూ రాయలసీమవాసులకు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. అనంతపురం, కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని,కువైట్‌కో,ముంబాయికో వలస వెళ్ళే పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కోరారు.ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫ్రంట్‌ అధ్యక్షుడు ఎంఆర్‌ఎన్‌ వర్మ మాట్లాడుతూ.. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి  వికేంద్రీకరణతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.ఈ రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం సాగే పోరాటంలో రాయలసీమే పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు. రాయలసీమ అభివృద్ధి కోసం చేపట్టే పోరాటానికి తాము వెన్నంటే ఉంటామని చెప్పారు. హైకోర్టు న్యాయవాది శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయం అన్ని విధాలుగా న్యాయమైనదని తెలిపారు. దీని వల్ల అమరావతితో పాటు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం తరతరాలుగా వెనుకబడిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టే అన్ని రకాల ఉద్యమాలకు తాము మద్దతు తెల్పుతున్నట్టు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది శాస్త్రీయ విధానమని అభిప్రాయపడ్డారు.  కుందు పోరాట సమితి అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమలో నీటి కరువు, వలసలు, రైతుల ఆత్మహత్యల వంటి అనేక సమస్యలు తరతరాలుగా ఉన్నాయన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి అభివృద్ధి ఒక్కటే మార్గమన్నారు. ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నట్టు చెప్పారు.విజయవాడకు చెందిన సురేష్‌, రాబర్ట్‌ మాట్లాడుతూ.. మూడు రాజధానులకు తాము మద్దతు తెలియజేస్తున్నామన్నారు. సీఎం జగన్‌ వల్లే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు.శంకరంబాడి సాహిత్య పీఠం కన్వీనర్‌ మస్తానమ్మ, రాయలసీమ విద్యార్థి సంఘం కన్వీనర్‌ భాస్కర్‌, నరేంద్రయాదవ్‌, బీసీ జేఏసీ యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ నాగేశ్వరరావు, వైఎ్‌సఆర్‌ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ప్రేమ్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



వర్తించని కొవిడ్‌ నిబంధనలు


 నగర నడి బొడ్డులో వందల సంఖ్యలో మహిళలను మైదానంలోకి తీసుకువచ్చి ఎలాంటి కొవిడ్‌ నిబంధనలను పాటించకపోయినా పోలీసులకు ఆ విషయం కనిపించకపోవడం ఆశ్చర్యం. నగరానికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో శుక్రవారం అమరావతి రైతులు నిర్వహించిన సభలో కొవిడ్‌ నిబంధనలు అతిక్రమించారని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కానీ ఇక్కడ చిన్నపాటి మైదానంలోకి వందలమంది మహిళలను, విద్యార్థులను తీసుకువచ్చి కూర్చోబెట్టినా అడిగే నాథుడు లేడు. రైతులకు వర్తించిన కొవిడ్‌ నిబంధనలు ఈ సమావేశానికి వర్తించవా అంటూ పలువురు చర్చించుకోవడం కన్పించింది.


కాలేజీకని వస్తే..మీటింగుకు తీసుకొచ్చారట!


రోజూలాగే ఈరోజు కూడా కాలేజీ బస్సెక్కామని..అయితే నేరుగా తుడా మైదానానికి తీసుకొచ్చారని పలువురు విద్యార్థులు వాపోయారు.రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి తిరుపతిలోని పలు ప్రైవేట్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులను తరలించారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థులకు మైదానం దగ్గర బస్సు ఆగిన తర్వాత కానీ ఎందుకు తీసుకొచ్చారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. కొంతమందిని మాత్రం అధ్యాపకుల ద్వారా మోటివేట్‌ చేయించి సభకు తరలించినట్లు తెలిసింది. ఉదయం 10గంటలకల్లా ప్రాంగణానికి చేరుకున్న విద్యార్థులు ఆలస్యంగా సభ ప్రారంభంకావడంతో ప్రాంగణం నుంచి బయటకు వెళుతూ కనిపించారు.

Updated Date - 2021-12-19T06:55:19+05:30 IST