యూనియన్‌ బ్యాంకులో తాకట్టు బంగారం మాయం?!

ABN , First Publish Date - 2021-12-28T06:29:48+05:30 IST

ఆర్థిక అవసరాల కోసం తాకట్టుపెట్టిన బంగారం మాయం కావడంతో యూనియన్‌ బ్యాంకును తెరవకుండా ఖాతాదారులు సోమవారం అడ్డుకున్నారు. దీంతో బ్యాంకు వద్ద రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

యూనియన్‌ బ్యాంకులో తాకట్టు బంగారం మాయం?!
యూనియన్‌ బ్యాంకు అధికారులను నిలదీస్తున్న ఖాతాదారులు

బ్యాంకును తెరవకుండా అడ్డుకున్న ఖాతాదారులు


గుర్రంకొండ, డిసెంబరు 27: ఆర్థిక అవసరాల కోసం తాకట్టుపెట్టిన బంగారం మాయం కావడంతో యూనియన్‌ బ్యాంకును తెరవకుండా ఖాతాదారులు సోమవారం అడ్డుకున్నారు. దీంతో బ్యాంకు వద్ద రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బాధితుల కథనం మేరకు..... గుర్రంకొండ కొత్తపేటకు చెందిన కె.మల్లికార్జునరెడ్డి 2019వ సంవత్సరంలో యూనియన్‌ బ్యాంకులో 108 గ్రాముల ఆభరణాలను తాకట్టుపెట్టి రూ.2 లక్షలు తీసుకున్నాడు.ఈ నెల 2వ తేదిన వడ్డీతో కలిపి రూ.2,46,000 చెల్లించాడు.సొమ్ము చెల్లించిన గంటల వ్యవధిలో ఇవ్వాల్సిన తాకట్టు ఆభరణాలను 25 రోజులు గడుస్తున్నా  ఇవ్వలేదు. బ్యాంకు అధికారులను నిలదీయగా తాకట్టు పెట్టిన తొమ్మిది రకాల ఆభరణాల్లో రెండు మాత్రమే ఉన్నాయన్నారు. 108 గ్రాముల బంగారానికి 20 గ్రాములు మాత్రమే బ్యాంకులో ఉన్నట్లు తెలిపారు.అలాగే నడిమికండ్రిగ పంచాయితీ గెరికుంటపల్లెకు చెందిన కె.సుధారాణి కువైట్‌ వెళ్లడానికి ముందు ఇంట్లో బంగారం ఉంచితే భద్రత లేదని 2019 ఏప్రిల్‌ నెలలో గుర్రంకొండ యూనియన్‌ బ్యాంకులో 120 గ్రాముల మూడు రకాల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి కేవలం రూ.18 వేలు తీసుకొంది.బ్యాంకు అధికారులు  గత ఏడాది బంగారం లోన్‌ రెన్యువల్‌ చేయాలనడంతో ఆమె సోదరుడు కె.అయ్యప్ప మే నెలలో రూ.18 వేలకు వడ్డీ రూ.3,600తో కలిపి రూ.21,600 చెల్లించాడు. అయితే బ్యాంకు మేనేజర్‌ ఖాతాదారులకు తప్ప వేరే వారికి ఆభరణాలు ఇవ్వడం కుదరదనడంతో ఆభరణాలను తీసుకోలేకపోయారు.కువైట్‌ నుంచి గత నెలలో వచ్చిన సుధారాణి ఈ నెల 15వ తేదిన ఆభరణాలను ఇవ్వాలంటూ బ్యాంకు అధికారులను కోరింది.అయితే తాకట్టుపెట్టిన 120 గ్రాములకు గాను 25 గ్రాముల  నెక్లెస్‌ మాత్రమే లాకర్లో వుందన్న మేనేజర్‌ నాగవెంకటేష్‌ పరిశీలించి న్యాయం చేస్తామని రోజులు గడుపుతూ వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9.30 గంటలకే బ్యాంకు వద్దకు చేరుకున్న ఖాతాదారులు బ్యాంకు తెరవకుండా అడ్డుకొన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు బ్యాంకును తెరవనీయబోమంటూ అధికారులను నిలదీశారు. దీంతో బ్యాంకు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని సర్దిచెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదును తీసుకున్న ఎస్‌ఐ హరిహరప్రసాద్‌ విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి దాకా బ్యాంకు కార్యకలాపాలు సాగేలా చూడాలని బాధితులకు సర్దిచెప్పడంతో బ్యాంకు మధ్యాహ్నం తెరుచుకొంది.ఈ విషయం తెలిసిన మిగిలిన ఖాతాదారులు తాము తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము తాకట్టుపెట్టిన ఆభరణాల వివరాలను సరిచూసుకోవడం మొదలుపెట్టారు.బ్యాంకు అధికారులు పూర్తిగా  పరిశీలిస్తే ఎంత మొత్తంలో బంగారం మాయమైందో తెలుస్తుంది.

Updated Date - 2021-12-28T06:29:48+05:30 IST