అమ్మో.. ఏమవునో..!

ABN , First Publish Date - 2021-11-23T07:47:11+05:30 IST

గత నెల కురవాల్సిన సాధారణ వానల కంటే 22.8 శాతం ఎక్కువగా కురిశాయి. ఈ నెలలో నమోదు కావాల్సింది 162 మిల్లీమీటర్ల వర్షపాతమైతే.. ఇప్పటికే 413 మిల్లీమీటర్లు నమోదైంది. అంటే సగటున 154 శాతం అదనంగా వర్షాలు పడ్డాయి.

అమ్మో.. ఏమవునో..!

 నెలాఖరులో భారీ వర్ష సూచనతో జిల్లా ప్రజల్లో భయాందోళన 

నవంబరులో ఇప్పటికే 154 శాతం అదనపు వర్షపాతం 

పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్లు

 ఇంకా వానలు పడితే తీవ్ర ప్రమాదమే 


(తిరుపతి, ఆంధ్రజ్యోతి) 

గత నెల కురవాల్సిన సాధారణ వానల కంటే 22.8 శాతం ఎక్కువగా కురిశాయి. ఈ నెలలో నమోదు కావాల్సింది 162 మిల్లీమీటర్ల వర్షపాతమైతే.. ఇప్పటికే 413 మిల్లీమీటర్లు నమోదైంది. అంటే సగటున 154 శాతం అదనంగా వర్షాలు పడ్డాయి. సెంటీమీటర్లలో చూస్తే 16కు బదులు 41 పడింది. 51 మండలాల్లో సాధారణ వర్షపాతానికంటే వంద నుంచి 600 శాతం వరకు అధికంగా నమోదైంది. ఎప్పుడూ సాధారణ వర్షాలు కురిస్తే చాలని మొక్కుకునే జిల్లా ప్రజలకు.. వరుణుడి ఈ అసాధారణ కరుణ అంతిమంగా శాపంగా మారుతోంది. అక్టోబరులో కురిసిన వర్షాలతో వరి, టమోటా తదితర పంటల సాగుకు ఉపకరిస్తుందని రైతులు సంబరపడ్డారు. కానీ నవంబరుకు వచ్చేసరికి వానలు ప్రమాదకరంగా మారాయి. ఈనెల 19వ తేదీన తిరుమలలో రికార్డు స్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం సంభవించింది. కనీవినీ ఎరుగని రీతిలో వీధులను వర్షపు నీరు ముంచెత్తగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, పశువులు ఆ నీటిలో కొట్టుకుపోవడం తిరుపతివాసులకు కొత్త భయానక అనుభవం. ఇక జిల్లాలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు ఇప్పటికే నిండిపోయాయి. పలు చెరువులు, కుంటలకు గండ్లు పడగా మరిన్ని ప్రమాదకర స్థితికి చేరాయి. వర్ష బీభత్సం నుంచి తిరుపతి, చిత్తూరు నగరాలు ఇంకా కోలుకోలేదు. మదనపల్లె, పుంగనూరు పట్టణాల్లోనూ జనం తీవ్ర ఇబ్బందులు చవిచూశారు. పలుచోట్ల వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తూ.. అయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇలాంటి తరుణంలో ఈనెల 26 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరిక ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. దీని ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అపార నష్టం సంభవించవచ్చని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. అందుకని ప్రమాదకర స్థితిలో ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను గుర్తించడం, వాటి నుంచి మొరవల ద్వారా సాధ్యమైన మేరకు నీటిని దిగువకు విడిచిపెట్టడం వంటి చర్యలు అధికారులు తక్షణం చేపట్టాల్సి ఉంది. ఆ సందర్భంగా నీటి ఉధృతికి రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతినకుండానూ, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఈనెల 19న కురిసిన వర్షాల సందర్భంగా యంత్రాంగం ఆలస్యంగా స్పందించిన తీరులో కాకుండా ముందస్తుగానే సన్నద్ధమై ఉండాల్సిన అవసరముంది.


Updated Date - 2021-11-23T07:47:11+05:30 IST