బిడ్డలను కాపాడబోయి.. అందరూ ప్రాణాలు కోల్పోయి..

ABN , First Publish Date - 2021-02-05T05:36:59+05:30 IST

కుప్పం మండలం కృష్ణదాసనపల్లె పంచాయతీ..

బిడ్డలను కాపాడబోయి..   అందరూ ప్రాణాలు కోల్పోయి..
రుక్మిణి . ఆరతి , కీర్తి ,రాజేశ్వరి మృతదేహాలు

చెరువు కుంటలో ప్రమాదవశాత్తూ పడి ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు మృత్యువాత

ఒంటూరులోని ఒకే కుటుంబంలో తీరని విషాదం


కుప్పం(చిత్తూరు): కుప్పం మండలం కృష్ణదాసనపల్లె పంచాయతీ, ఒంటూరు గ్రామంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువు కుంటలో పడి మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు తోడికోడళ్లు కాగా, మిగిలిన ఇద్దరు చిన్నారులు వారిలో ఒక మహిళ బిడ్డలే కావడం విషాదం. పోలీసుల కథనం మేరకు....20 సంవత్సరాల క్రితం శంక్రూప్రసాద్‌ కుటుంబం దూర ప్రాంతంనుంచి ఒంటూరుకు వలసొచ్చింది. డెబ్భయ్యేళ్ల ఆ వృద్ధుడి భార్య ఎప్పుడో గతించింది. పెద్దకొడుకు మునిలాల్‌ ప్రసాద్‌, కోడలు రుక్మిణి (30). ఆరతి (8), కీర్తి (6) అని వీరికిద్దరు చిన్నారులు. చిన్నకొడుకు రవిప్రసాద్‌, అతడి భార్య రాజేశ్వరి (27) దంపతులకు పిల్లలు లేరు. అన్న మునిలాల్‌ ప్రసాద్‌ పిల్లలనే తమ పిల్లలుగా ముద్దుచేసి గారాబంగా చూసుకుంటూ వచ్చారు.


దూర ప్రాంతంనుంచి వలసొచ్చిన ఉమ్మడి కుటుంబం కావడంతో ఆస్తిపాస్తులేమీ లేకపోగా, కాలనీ ఇళ్లలో కాపురముంటున్నారు. అన్నదమ్ముళ్లిద్దరూ భవనాలకు టైల్స్‌ వేసే పని చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ కొన్ని రోజులుగా మైసూరుకు వెళ్లి అక్కడ పనులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తోడికోడళ్లు రుక్మిణి, రాజేశ్వరి గురువారం ఉదయం దుస్తులుతకడంకోసం గ్రామ సమీపంలోని చింపనగల్లు చెరువు వద్దకు వెళ్లారు. రుక్మిణి కుమార్తెలు ఆరతి, కీర్తి కూడా పాఠశాలకు వెళ్లకుండా వీరి కొంగు పట్టుకుని వెంటపడ్డారు. చెరువులోని ఒక చిన్నపాటి కుంటలా నిలిచిన నీటివద్ద ఇద్దరు మహిళలు దుస్తులుతుకుతుండగా, చిన్నారులిద్దరూ కుంటలోకి దిగి ఆటలాడసాగారు. లోపలికెళ్లొద్దంటూ పిల్లలను అరుస్తూనే తలొంచి బండ రాళ్లమీద దుస్తులు ఉతుకుతున్న మహిళలకు ఉన్నట్టుండి చిన్నారుల ఆర్తనాదాలు వినిపించాయి.


నీటిలో ముందుకెళ్లిన ఆరతి, కీర్తిలిద్దరూ అప్పటికే ఆ కుంట మధ్యలో గతంలో లోతుగా తవ్విన ఉపాధి గుంతలో పడి మునిగిపోయారు. చిన్నారుల కేకలు ముందుగా విన్న వారి తల్లి రుక్మిణి ప్రమాదాన్ని శంకించి అదురుపాటుకు గురైంది. కాస్త దూరంగా కుంటలోని నీటి లోలోపలికి మునిగిపోతూ, పైకి తేలుతూ చేతులు గాల్లోకి లేపి నిస్సహాయంగా అరుస్తున్న కన్నబిడ్డలను చూడగానే ఆమె గుండె క్షణంపాటు ఆగి కొట్టుకుంది. ఉత్తర క్షణంలో ఆ బురదను తొక్కుకుంటూ వెళ్లి నీటిలో మునిగిపోతున్న పిల్లల వద్దకు చేరుకుని చేయందించడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో అప్పటికే పిల్లలు మునిగిపోతున్న ఉపాధి గుంతలోకి తానూ ఒరిగిపోయింది. ఆమె వెనుకే పరుగున వస్తున్న తోడికోడలు రాజేశ్వరికీ ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. కన్నబిడ్డలకంటే ఎక్కువగా చూసుకునే తోడికోడలు పిల్లలు కళ్లముందే మునిగిపోతుంటే, చూస్తూ ఊరుకోలేక పోయింది. వారిని అందుకుని గట్టున వేయడానికి ప్రయత్నించి తాను కూడా అదే లోతైన ఉపాధి గుంతలోకి పడిపోయింది. వారి ఆర్తనాదాలు పట్టించుకుని కాపాడేందుకు ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేరు.


అలా ఆ ఇద్దరు తల్లులూ, ఇద్దరు చిన్నారులూ ఆ నీటి మడుగులో దాక్కున్న లోతైన ఉపాధి గుంతలోకి జారిపోయి ఊపిరాడక మృతి చెందారు. బిడ్డలను వొదులుకోలేని ఆ అమ్మలిద్దరూ వారితోపాటే అనంత లోకాలకు తరలి వెళ్లిపోయారు. అంతా అయిపోయాక, ఎవరో నీటితో తేలుతున్న మృతదేహాలను గమనించి, సమాచారమందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాలను వెలికి తీయించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా రుక్మిణి, రాజేశ్వరి భర్తలైన మునిలాల్‌ ప్రసాద్‌, రవిప్రసాద్‌ అన్నాదమ్ముళ్లు, ప్రమాదం జరిగిన సమయంలో వీరిద్దరూ ఊళ్లో లేరు. మైసూరులో కూలి పనులకు వెళ్లిన వారు, ప్రమాదం గురించి గ్రామస్థులు ఫోన్‌ చేసిన తర్వాత అక్కడినుంచి గ్రామానికి బయలుదేరారు.


చంద్రబాబు సంతాపం

ఒంటూరులో ఒకే కుటుంబంలోని నలుగురు చెరువులోని కుంటలో మునిగి మృతి చెందిన దుర్ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండు చేశారు.

Updated Date - 2021-02-05T05:36:59+05:30 IST