నిద్రమత్తు రెండు ప్రాణాలు తీసింది

ABN , First Publish Date - 2021-05-03T05:12:21+05:30 IST

నిద్రమత్తు రోడ్డు ప్రమాదానికి కారణమైంది. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మృతుల్లో ఏడునెలల చిన్నారి ఉండడం విషాదం. ఈ సంఘటన కేవీపల్లె మండల పరిధిలో జరిగింది.

నిద్రమత్తు రెండు ప్రాణాలు తీసింది
సంఘటనా స్థలంలో మృతి చెందిన పాల్‌గ్రేస్‌విన్‌

రోడ్డుప్రమాదంలో ఇద్దరు కేరళ వాసుల మృతి

మృతుల్లో ఏడునెలల చిన్నారి 

మరో ముగ్గురికి తీవ్రగాయాలు


కేవీపల్లె, మే 2: నిద్రమత్తు రోడ్డు ప్రమాదానికి కారణమైంది. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మృతుల్లో ఏడునెలల చిన్నారి ఉండడం విషాదం. ఈ సంఘటన కేవీపల్లె మండల పరిధిలో జరిగింది. పోలీసులు కథనం మేరకు. కేరళ చెందిన పాల్‌గ్రేస్‌విన్‌ (33) మహారాష్ట్రలోని నాగపూర్‌లో దేవదత్త రెసిడెన్సీ, సంస్కృతీలేఅవుట్‌, పిప్లా అనే చిరునామాలో నివాసముంటున్నాడు. వీరున్న  అపార్ట్‌మెంట్‌లో వర్గీస్‌ అనే కేరళకు చెందిన వ్యక్తి కూడా ఉంటున్నారు. ఈ నెల ఆరో తేదీన కేరళలోని త్రిసూర్‌లో వర్గీస్‌  వివాహం జరగనుంది. దీంతో శనివారం ఉదయం పాల్‌గ్రేస్‌విన్‌ కుటుంబ సభ్యులతో పాటు వర్గీస్‌ కూడా కేరళకు ఇన్నోవా వాహనంలో నాగపూర్‌ నుంచి బయలుదేరారు. ఆదివారం ఉదయం కేవీపల్లె మండల పరిధిలోని కలికిరివాండ్లపల్లె సమీపంలో చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న బ్రిడ్జిగోడను బలంగా ఢీకొంది. డ్రైవింగ్‌ చేస్తున్న పాల్‌గ్రేస్‌విన్‌, ఇతని కుమార్తె ఇలియానాప్రిన్సెస్‌ (ఏడునెలలు) సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. ఇతని భార్య రచల్‌దిన్‌పాల్‌, కుమారుడు విలీజాపాల్‌, పెళ్లికుమారుడు వర్గీస్‌ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామ్మోహన్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. మృతదేహాలను పీలేరులోని మార్చురీకి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-05-03T05:12:21+05:30 IST