కొవిడ్‌ ఆస్పత్రులకు శ్రీసిటీ ఆక్సిజన్‌ ట్యాంకర్లు

ABN , First Publish Date - 2021-05-05T06:27:43+05:30 IST

కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు శ్రీసిటీలోని వీఆర్‌వీ సంస్థ రెండు ఆక్సిజన్‌ ట్యాంకర్లను తిరుపతి ఆస్పత్రులకు పంపింది.

కొవిడ్‌ ఆస్పత్రులకు శ్రీసిటీ ఆక్సిజన్‌ ట్యాంకర్లు
జెండా ఊపి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను తిరుపతికి పంపుతున్న రంగనేకర్‌ తదితరులు

సత్యవేడు, మే 4: కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు శ్రీసిటీలోని వీఆర్‌వీ సంస్థ ముందుకొచ్చింది. ఆ మేరకు.. రెండు ఆక్సిజన్‌ ట్యాంకర్లను మంగళవారం రాత్రి వీఆర్‌వీ సంస్థ ఎండీ రంగనేకర్‌, శ్రీసిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌కుమార్‌ జెండా ఊపి తిరుపతికి పంపారు. ఇందులో భాగంగా 13వేల లీటర్ల సామర్థ్యమున్న ఓ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను బర్డ్‌ ఆస్పత్రికి, పదివేల లీటర్ల సామర్థ్యమున్న మరో ట్యాంకర్‌ను రుయా ఆస్పత్రికి అందజేయనున్నారు. కొవిడ్‌ కేర్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టాంది. ఆ మేరకు ఆక్సిజన్‌ ట్యాంకుల సరఫరాకు శ్రీసిటీని సంప్రదించింది. చెన్నైకి చెందిన ట్యాలెంట్‌ప్రో ఇండియా సంస్థ 13వేల లీటర్ల ట్యాంకర్‌ను వితరణగా ఇచ్చిది. 10 వేల లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకును ప్రభుత్వమే కొనుగోలు చేసింది. వీఆర్‌వీ సంస్థ యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ ట్యాంకర్లను సరఫరా చేయడం ప్రశంసనీయమని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కొనియాడారు. ఇప్పటికే పదివేల లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకర్‌ను స్విమ్స్‌ను వితరణగా ఇచ్చిన విషయం గుర్తుచేశారు. ట్యాంకర్ల వితరణ సరైన సమయంలో చేసిన .సాయమని టీటీడీ ఇన్‌చార్జి ఈవో ధర్మారెడ్డి చెప్పారు. కార్యక్రమంలో బర్డ్‌ ఆస్పత్రి స్పెషలాఫీసర్‌ ఆర్‌.రెడ్డప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-05T06:27:43+05:30 IST