రాళ్లకాల్వ వంతెనపై రెండు లారీల ఢీ

ABN , First Publish Date - 2021-02-08T05:32:42+05:30 IST

రేణిగుంట మండలం రాళ్లకాల్వ వంతెనపై ఆదివారం మధ్యాహ్నం రెండు లారీలు ఢీకొన్నాయి.

రాళ్లకాల్వ వంతెనపై రెండు లారీల ఢీ
రాళ్లకాలువ వంతెనపై ఢీకొన్న లారీలు

ఏడు గంటలపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం 

స్కూటరిస్టుకు గాయాలు


రేణిగుంట, ఫిబ్రవరి 7: రేణిగుంట మండలం రాళ్లకాల్వ వంతెనపై ఆదివారం మధ్యాహ్నం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనతో శ్రీకాళహస్తి- రేణిగుంట మధ్య దాదాపు 7 గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటేశు అనే యువకుడికి స్వల్పగాయమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో శ్రీకాళహస్తి వైపువెళ్తున్న లగేజీ లారీని కర్ణాటక నుంచి చెన్నై వెళ్తున్న మరో లారీ ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటేశుకు స్వల్పగాయాలు కాగా, లారీలు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో వంతెనపై వాహనాలు ఎటూ వెళ్లలేని పరిస్థితి. రెండు వైపులా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ స్తంభించింది. డీఎస్పీ రామచంద్ర, సీఐ అంజుయాదవ్‌, ఎస్‌ఐ సునీల్‌ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్లను తెప్పించుకుని లారీలను తొలగించే పనులు చేపట్టారు. చిన్న చిన్న వాహనాలు రాళ్ల కాల్వ వంతెన పక్కన.. ఉన్న లోలెవల్‌ బ్రిడ్జిపై రాకపోకలు సాగించాయి. మరికొందరు. ప్రత్యామ్నాయంగా పాపానాయుడుపేట మార్గంలో వెళ్లారు. గంటలకొద్దీ ఆలస్యమవుతుండటంతో పలువురు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని వెనుదిరిగారు. ట్రాఫిక్‌ మధ్యలో ఇరుక్కున్న బస్సుల్లోని కొందరు ప్రయాణికులు నడుచుకుంటూ వెనక్కి వచ్చి ఆటోల్లో ఇళ్లకు వెళ్లిపోయారు. దర్శనాలకు వచ్చిన భక్తులు అవస్థలు పడ్డారు. సాయంత్రం 7 గంటల సమయంలో ఒకలారీని తొలగించి రోడ్డుపక్కన నిలబెట్టారు. అప్పటి నుంచి అటవైపు కాసేపు.. ఇటువైపు కాసేపు వాహనాలను వదిలారు. శ్రీకాళహస్తి నుంచి వచ్చే వాహనాలను రాళ్లకాల్వ లోలెవల్‌ బ్రిడ్జి మీదుగా వదిలారు. 8.20 గంటల సమయంలో రెండో లారీని కూడా తొలగించారు. అనంతరం వంతెనపై రెండువైపులా వాహనాలు రాకపోకలు సాగించడంతో కాసేపటికి ట్రాఫిక్‌ సమస్య తీరింది.

Updated Date - 2021-02-08T05:32:42+05:30 IST