ఇద్దరు హుండీ చోరుల అరెస్టు

ABN , First Publish Date - 2021-08-22T04:55:15+05:30 IST

దేవాలయాల్లో హుండీలను పగులగొట్టి నగదు ఎత్తుకెళుతున్న ముఠాలోని ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు హుండీ చోరుల అరెస్టు
నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు

రూ.30,500 నగదు స్వాధీనం


చిత్తూరు, ఆగస్టు 21: దేవాలయాల్లో హుండీలను పగులగొట్టి నగదు ఎత్తుకెళుతున్న ముఠాలోని ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం డీఎస్పీ సుధాకరరెడ్డి మీడియాకు వివరించారు. ఇటీవల కాలంలో దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈనెల 16వ తేదీన తవణంపల్లె మండలం ఎస్‌.కృష్ణాపురంలోని వీరాంజనేయస్వామి ఆలయ హుండీలోని డబ్బులను కాజేయడానికి దొంగలు ప్రయత్నించారు. నిందితుల గురించి సమాచారం అందడంతో తవణంపల్లె ఎస్‌ఐ రాజశేఖర్‌ సిబ్బందితో కలిసి శనివారం యాదమరి మండలం తిరుపతి-బెంగళూరు హైవేలోని వరిగపల్లె బ్రిడ్డి వద్ద బంగారుపాళ్యం మండలం బందార్లపల్లెకు చెందిన వడ్డే అమరనాథ్‌, అదే మండలం తగ్గువారిపల్లెకు చెందిన భరత్‌కుమార్‌ అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలో అతన్ని కూడా పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన తవణంపల్లె ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో వెస్ట్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T04:55:15+05:30 IST