రూ.కోటి దిగమింగారు

ABN , First Publish Date - 2021-02-08T06:24:31+05:30 IST

మద్యం దుకాణాల నగదు స్వాహా చేసిన కేసులో తిరుపతి అబ్కారీ అధికారులు, సత్యవేడు పోలీసులు ఒక ఏఏవోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

రూ.కోటి దిగమింగారు
వరదయ్యపాళెంలోని ఓ దుకాణంలో అధికారుల విచారణ

సత్యవేడు/వరదయ్యపాళెం, ఫిబ్రవరి 7: మద్యం దుకాణాల నగదు లావాదేవీలు చూస్తున్న సిబ్బంది చేతివాటం చూపారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ చలానాలతో బ్యాంకు అధికారులనే మోసం చేశారు. దాదాపు రూ.కోటి స్వాహా విషయం బయటికి పొక్కడంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వివరాలివీ.. వరదయ్యపాళెం, సత్యవేడు మండలాల పరిధిలోని మద్యం దుకాణాల్లో విక్రయాలకు సంబంధించిన నగదు లావాదేవీలను అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్లు(ఏఏవో) చూస్తుంటారు. దుకాణాల నుంచి సేకరించిన మొత్తాన్ని స్థానిక బ్యాంకుల్లో జమచేసి ఆ రసీదులను ఉన్నతాధికారులకు పంపుతుంటారు. అయితే ప్రభుత్వ సొమ్ము కదా, దిగమింగితే ఎవరు గుర్తిస్తారని అనుకున్నారు. దీంతో సంబంధిత బ్యాంకుల నకిలీ సీళ్లు సిద్ధం చేసుకున్నారు. అనంతరం బ్యాంకు అధికారుల సంతకాలనూ ఫోర్జరీ చేసి బ్యాంకు చలానాలు సృష్టించారు. వరదయ్యపాళెం, సత్యవేడు మండలాల మద్యం దుకాణాల నుంచి సేకరించిన నగదును ఇద్దరు సిబ్బంది దిగమింగుతూ వచ్చారు. అయితే జనవరి 26న కూడా బ్యాంకులో నగదు జమ అయినట్లు చలానాలు అందడంతో ఉన్నతాధికారులు అనుమానించారు. ఆ మేరకు విజయవాడ నుంచి వచ్చిన ఏపీఎస్బీసీఎల్‌ అధికారులు గుట్టుగా విచారణ జరపడంతో రూ.కోటికిపైగా ప్రభుత్వ సొమ్ము స్వాహా అయినట్లు తేలింది. దీంతో ఓ అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ను తిరుపతి ఆబ్కారీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మరో ఏఏవో పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఆలస్యంగా మేల్కొనడంపై విమర్శలు వస్తున్నాయి. 

Updated Date - 2021-02-08T06:24:31+05:30 IST