ఇదో మహాప్రస్థానం

ABN , First Publish Date - 2021-12-15T06:57:22+05:30 IST

రాష్ట్ర రాజధాని కోసం పాదయాత్ర రూపంలో పోరాటం చేసే గొప్ప అవకాశం, అదృష్టం మాకు దక్కిందనే భావిస్తున్నామని అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు తెలిపారు.

ఇదో మహాప్రస్థానం
తిరుపతిరావు

తిరుపతి, ఆంధ్రజ్యోతి: 44 రోజులుగా మహిళలు, వృద్ధులు సహా నడిచారు. ఇళ్ళను, పిల్లలను విడిచిపెట్టి వచ్చారు. అనారోగ్యం కలిగినా, సదుపాయాలు బాగా లేకున్నా ఎవరూ వెనుదిరిగి వెళ్లిపోలేదు. వాళ్ల కుటుంబంలో ఎవరికి బాగాలేదని తెలిసినా, ఫోన్‌లోనే మాట్లాడుతూ నడక కొనసాగించారు. ఇక చాలు వచ్చేయండి అని ఏ ఒక్కరినీ వాళ్ల ఇళ్ల నుంచి కూడా పిలవలేదు. ఎందుకు ఇదంతా అనే ఒత్తిడి లేదు. మనకోసం.. మన బిడ్డల కోసం.. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అనే ఎరుక అందరిలో ఉండడం వల్లే ఇది సాధ్యం అయ్యింది. ఇదొక దీక్ష. జనం అంకితభావంతో చేపట్టిన మహాయాత్ర. పాదయాత్రలో నడిచిన వారు, యాత్రకు సాయం చేసిన వారు, వాహనాలు నడిపిన వారు, ట్రాక్టర్లు నడిపిన వారు... ఇలా ఎవరికి వారు గొప్ప పాత్ర పోషించారు. రాష్ట్ర రాజధాని కోసం పాదయాత్ర రూపంలో పోరాటం చేసే గొప్ప అవకాశం, అదృష్టం మాకు దక్కిందనే భావిస్తున్నామని అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు తెలిపారు. 


బెదిరింపులు.. లాఠీదెబ్బలు..కేసులు..

పాదయాత్ర సాగినంతమేరా అపూర్వమైన స్వాగతం లభించిం ది.అదే మా నడక శ్రమను, అలసటను పోగొట్టింది. అయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రం పోలీసులు బాగా ఇబ్బంది పెట్టా రు. ప్రకాశం జిల్లా పరుచూరులో డీఎస్పీ స్థాయి అథికారి పాదయాత్రకు ఇబ్బంది కలిగేలా ట్రాఫిక్‌ను మళ్ళించారు. మాపై తప్పుడు కేసులు పెట్టారు. నెల్లూరు జిల్లా కావలి, పొదలకూరుల్లో కూడా పోలీసులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు. వెంకటగిరిలో ప్రవేశించే ముందు నాగమల్లేశ్వరరావు అనే గూడూరు సీఐ మా రోప్‌ పార్టీ మనిషిని పక్కటెముక విరిగేలా కొట్టారు. అతడిని వీఆర్‌కు బదిలీ చేశారు. శ్రీకాళహస్తి మండలంలో భోజనం చేసేందుకు చదును చేసిన స్థలాన్ని దున్నించేశారు. మరో రైతు మాకు స్థలం కేటాయిస్తే అతన్ని బెదిరించారు. శ్రీకాళహస్తిలో బస చేయడానికి కళ్యాణ మండపాలు బుక్‌ చేసుకుంటే యజమానులను బెదిరించి ఇవ్వకుండా చేశారు. దాంతో మూడు రోజులపాటు బయటే టెంట్లు వేసుకుని గడిపాం.  మాపై దారిపొడవునా యాభైకి పైగా కేసులు పెట్టారు. అసలు 2019 డిసెంబరు 17న సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రకటన చేసిప్పటి నుంచే మాపై వందలాది తప్పుడు కేసులు బనాయించారు. ఎస్పీ స్థాయి అధికారి మహిళలపై లాఠీతో దాడిచేశారు. రాజధాని ప్రాంతంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోంది. అయితే రాజధాని కోసమే ఇదంతా భరిస్తున్నాం.


ప్రకృతి కూడా దీవించింది

ప్రకృతి  కూడా మమ్మల్ని దీవించింది. మా ఆకాంక్షను ఆమోదిస్తున్నట్టుగా జల్లులు కురిపించిందే తప్ప ఎక్కడా అవరోధం కలిగించలేదు.వరదలు కొన్ని చోట్ల ముంచెత్తుతున్నపుడు కూడా మేము నడుస్తున్న ప్రాంతాల్లో ఇబ్బంది కలగలేదు. వానలు పడుతున్నపుడే శ్రీకాళహస్తిలో మూడు రోజులు ఖాళీ మైదానాల్లో వున్నాం. మేమున్న చోటుకు కిలోమీటరు దూరంలో భారీ వర్షాలు కురిశాయి.కానీ మేమున్న చోట వానలేదు. మా సంకల్ప శుద్ధికి ప్రకృతి సహకరించిందనే చెప్పాలి.


తలో చేయివేసి నడిపించారు

పాదయాత్రకు వనరులు, డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. మొదటి రోజు నుంచీ కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా రోజుకూలీలు కూడా శక్తిమేరకు వంద నుంచీ వెయ్యి రూపాయలదాకా విరాళాలు ఇచ్చారు. ప్రవాసాంధ్రులు స్పందించి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. 


తిరుపతికే ఎందుకంటే.. 

అమరావతిలో మొదలుపెట్టిన నడకకు తిరుపతినే గమ్యంగా ఎందుకు ఎంచుకున్నామంటే.. తిరుపతి దేశంలోనే కాదు ప్రపంచంలోనే హిందూ పుణ్యక్షేత్రం.ఇంతగొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం మన రాష్ట్రంలో వుండడం మహద్భాగ్యం. బాధల్లో వున్నపుడు వెంకటేశ్వరస్వామికి మొక్కుకోవడం ప్రతి కుటుంబం చేసేదే. ప్రభుత్వ అణచివేతకు, వేధింపులకు గురవుతున్న ప్రజలుగా మా ఇలవేల్పు అయిన ఆ వేంకటేశ్వరుడికే మా బాధలు చెప్పుకోవాలనుకున్నాం. శ్రీవారి సన్నిధినే మా గమ్యంగా ఎంచుకున్నాం.   


తీర్పును గౌరవిస్తాం!

రాజ్యాంగానికి, చట్టాలకు మేం బద్దులం. తిరుపతిలో బహిరంగసభకు అనుమతి రాకపోతే న్యాయస్థానం తీర్పును గౌరవిస్తాం.ప్రభుత్వంలా కోర్టులపై విమర్శలు చేయం. రాజ్యాంగ బద్ధ పదవుల్లోని వారిని గౌరవించే సాంప్రదాయం కలిగిన కుటుంబాల నుంచీ వచ్చిన వాళ్ళం. కట్టుదప్పి ప్రవర్తించం. 


కొంత విరామం తర్వాత తదుపరి కార్యాచరణ

ఈ పాదయాత్రతో ముగిసిపోయిందని మేమేమీ భావించడం లేదు. 17 దాకా తిరుపతిలోనే వుంటాం. 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణమై ఇళ్ళకు చేరుకుంటాం. కొంత విరామం తీసుకుని అమరావతి పరిరక్షణ సమితిలోని అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చించి తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తాం.

Updated Date - 2021-12-15T06:57:22+05:30 IST