కొడుకు ప్రవర్తనపై విసిగి తండ్రి బలవన్మరణం
ABN , First Publish Date - 2021-09-03T06:46:04+05:30 IST
కొడుకు చేసిన అప్పుల కారణంగా ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం తిరుపతిలో చోటుచేసుకుంది.

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 2: కొడుకు చేసిన అప్పుల కారణంగా ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం తిరుపతిలో చోటుచేసుకుంది. అలిపిరి ఎస్‌ఐ మోహన్‌కుమార్‌గౌడ్ తెలిపిన వివరాల మేరకు.. మనోహర్ (55), ఆయన కుమారుడు మణి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరు జీవకోనలో కాపురం ఉంటున్నారు. కుమారుడు అప్పులుచేయడంతో ఉన్న ఇల్లు విక్రయించి అప్పులు కట్టారు. మళ్లీ అప్పులు చేయడంతో పాటు మణి దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఓ దొంగతనం కేసులో మణిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన మనోహర్.. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరేసుకున్నారు. స్థానికుల సమాచారంతో అలిపిరి ఎస్‌ఐ మోహన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఆయన కుమారుడు అప్పులు చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.