వి.కోటలో భారీ చోరీ పనోడి పనే

ABN , First Publish Date - 2021-12-29T05:20:16+05:30 IST

వి.కోట పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు, సీవీఆర్‌ఎం కళాశాల అధినేత గోపిరెడ్డి ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేధించారు.

వి.కోటలో భారీ చోరీ పనోడి పనే
ఇంట్లో చిందర వందరగా వస్తువులు(ఫైల్‌)

అమ్మేందుకు ధైర్యం చాలక పోలీసులకు దొరికిన వైనం


వి.కోట, డిసెంబరు 28: వి.కోట పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు, సీవీఆర్‌ఎం కళాశాల అధినేత గోపిరెడ్డి ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. యజమానులు ఇంట్లోలేరన్న విషయం తెలుసుకున్న పనిమనిషి రాజేష్‌ పక్కా ప్రణాళికతో ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. రాడ్‌తో డోర్‌ను తొలగించి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, కొంత నగదును దోచుకుని అతని ఇంట్లో దాచుకున్నాడు. తెల్లవారేసరికి ఇతర పనివాళ్ళు దొంగతనం జరిగిన విషయం యజమానులకు సమాచారం ఇవ్వడంతో ఉదయాన్నే పోలీసులు రంగప్రవేశం చేశారు. తనపై ఎక్కడ అనుమానం వస్తుందోనని వి.కోట వదిలి వెళ్ళలేక పోయాడు. పోలీసులు వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించి అందరిపై నిఘా ఉంచారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి పాతనేరస్తులు, పొరుగు రాష్ర్టాల దొంగలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అనుమానంతో పని మనిషి రాజేష్‌ను స్టేషన్‌కు తరలించి విచారించగా నేరం తానే చేసినట్లు అంగీకరించి ఇంట్లో దాచి ఉంచిన రూ. కోటి రూపాయల విలువైన దొంగసొత్తును పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. పనిమనిషి ఒక్కడే ఈ దొంగతనం చేశాడా..? లేక వేరేవ్వరితోనైనా కలసి చేశాడా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వి.కోటలో భారీ చోరీ కేసును రోజుల వ్యవధిలోనే పోలీసులు చేదించడం పట్ల విచారణాధికారులను ఎస్పీ సెంథిల్‌కుమార్‌ అభినందించారు.

Updated Date - 2021-12-29T05:20:16+05:30 IST