స్తోమత ఉంటే రెండో అంతస్తూ కట్టుకోవచ్చు

ABN , First Publish Date - 2021-07-08T08:05:28+05:30 IST

లబ్ధిదారులకు స్తోమత ఉంటే జగనన్న ఇంటిపై రెండో అంతస్తూ నిర్మించుకోవచ్చని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాథ రాజు అన్నారు.

స్తోమత ఉంటే రెండో అంతస్తూ కట్టుకోవచ్చు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి రంగనాథ రాజు

లబ్ధిదారులకు మంత్రి రంగనాథరాజు సూచన 


తిరుపతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): లబ్ధిదారులకు స్తోమత ఉంటే జగనన్న ఇంటిపై రెండో అంతస్తూ నిర్మించుకోవచ్చని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాథ రాజు అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో వ్యవసాయ సలహామండలి తొలి సమావేశం, గృహ నిర్మాణాలపై బుధవారం సమీక్ష జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 1.15లక్షల ఇళ్లను గ్రౌండింగ్‌ చేయడం ద్వారా రెండో స్థానంలో నిలిచారన్నారు. జగనన్న కాలనీల వద్ద అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఇంటికి ఒక కొబ్బరిచెట్టు అందించి.. జగనన్న కాలనీల్లో కేరళ తరహా వాతావరణం తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. స్థానిక పంటలపై అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో అన్ని జిల్లాలకు వ్యవసాయ సలహా మండళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రైతులకు ఎరువులు, అవసరమైన విత్తనాలు అందించడం, పంటలకు ఆశించిన ధరలు వచ్చేలా చూడటం వంటి పనులు చేయాలని మండలి సభ్యులకు సూచించారు. 9నుంచి 22వ తేది వరకు జరిగే రైతు చైతన్య యాత్రల్లో పూర్తయిన 187 రైతు భరోసా కేంద్రాలను, 5 అగ్రిలాబ్స్‌ను ప్రారంభించుకోనున్నామని తెలిపారు. జిల్లాలో మామిడి పంట ఎక్కువగా ఉన్నందున వేపర్‌హీట్‌ ప్లాంట్‌, పాక్‌హౌస్‌ల వంటివి పెరగాలని, గొర్రెల పెంపకం, మీట్‌ పరిశ్రమల స్థాపన జరిగేలా చూడాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి కోరారు. ఇళ్ల గ్రౌండింగ్‌ చేపట్టడంతో.. ఇక నిర్మాణాలపై దృష్టి పెట్టనున్నామని కలెక్టర్‌ హరినారాయణన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ (హౌసింగ్‌) వెంకటేశ్వర, జిల్లా వ్యవసాయ మండలి అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-08T08:05:28+05:30 IST