బిక్కు బిక్కుమంటూ తిరుపతి జనం
ABN , First Publish Date - 2021-11-21T09:02:50+05:30 IST
ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు వందల కుటుంబాలను ఇళ్లకే పరిమితం చేసింది.

తిరుపతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మూడు రోజులుగా కాలుతీసి కాలు బయటపెట్టలేని స్థితి. తాగేందుకు నీళ్లు లేవు. పిల్లలకు పాలులేవు. చేతిలో పైసాల్లేవు. కరెంట్ లేదు. ఇలాంటి దయనీయ పరిస్థితిలో తిరుపతి నగరంతోపాటు పరిసరప్రాంత కాలనీల్లోని కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు వందల కుటుంబాలను ఇళ్లకే పరిమితం చేసింది.ముత్యాలరెడ్డిపల్లి పరిధిలో సరస్వతి నగర్, శ్రీకృష్ణ నగర్, ఉల్లిపట్టెడ, గాయత్రి నగర్,శ్రీనగర్ కాలనీ, గాంధీనగర్, తుమ్మలగుంట, తారకరామానగర్,తాటితోపు, రేణిగుంట రోడ్డులో ఆటోనగర్, సమీపంలోని గొల్లవాని గుంట, పూలవాని కుంట, నారాయణపురం, శ్రీనివాసపురం, పద్మావతీపురంలో కొంతభాగం,ఓటేరు, మంగళం పరిధిలో కేబీఆర్ నగర్,అవిలాల,ధనలక్ష్మీ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంకా వర్షపు నీరు తొలగిపోలేదు. ఇక్కడ వర్షాలకు మునుపు యూడీఎస్ కనెక్షన్లు ఇచ్చారు. అవి ఇంకా వాడుకలోకి రాలేదు. మ్యాన్‌హోల్స్ ఓపెన్‌చేస్తే నీటిమట్టం తగ్గుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. యంత్రాంగం పట్టించుకోవడంలేదని కనీసం వలంటీరు కూడా ఇటువైపు రావడంలేదని ఆవేదన చెందుతున్నారు. వాటర్ క్యాన్లు, పాల ప్యాకెట్లు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ఆలస్యంగా స్పందించిన యంత్రాంగం ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలతో పవర్‌బోట్ల సహాయంతో కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇదిలావుంటే మహిళా వర్సిటీ రోడ్డు, ఎయిర్ బైపాస్ రోడ్డులో యువత చేపలు పట్టుకోవడం, వాలీబాల్ ఆడటం, ఈతకొట్టడం వంటి దృశ్యాలు కనిపించాయి.
కపిలతీర్థంలో కూలిన మండపం
కపిలతీర్థంలోని వేణుగోపాలస్వామి ముఖమండపం శుక్రవారం రాత్రి వరద దెబ్బకు మూడు రాతి స్తంభాలు కూలిపోవడంతో స్లాబ్ నేలమట్టమైంది. ఘటనజరిగిన సమయంలో మండపం కింద భక్తులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఆలయ అధికారులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని భక్తుల క్యూలైన్లను మళ్లించారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మరో గోడను తొలగించారు.






