ఒక్కరూ పట్టించుకోలేదాయె!
ABN , First Publish Date - 2021-12-30T06:15:39+05:30 IST
అధికారులకు విన్నవించినా సమస్యను పట్టించుకోలేదని 31వార్డుకు చెందిన ఓ వీధి ప్రజలు సొంత నిధులతో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు.

శ్రీకాళహస్తి, డిసెంబరు 29: అధికారులకు విన్నవించినా సమస్యను పట్టించుకోలేదు. విసిగి వేసారిన 31వార్డుకు చెందిన ఓ వీధి ప్రజలు సొంత నిధులతో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైసీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న హోండా షోరూం పక్క వీధిలో 15 కుటుంబాలు నివసిస్తున్నాయి. కాగా, వర్షాలొస్తే ఈ వీధిలో వర్షపు నీరు నిలిచి ఇక్కడి జనం ఇబ్బందులు పడుతున్నారు. సమస్య తీర్చాలని ఏళ్ల తరబడి అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఒక్కరూ స్పందించలేదు. గతనెల కురిసిన భారీ వర్షాలకు నానా పాట్లు పడాల్సి వచ్చింది. దీంతో వీరందరూ ఇంటికి రూ.5వేల వంతున చందా వేసుకుని రూ.75వేలు పోగు చేశారు. ఈ నగదుతో ఇకపై వర్షపు నీళ్లు నిలవకుండా బుధవారం తమ వీధి రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభించినట్లు స్థానికుడు సందీప్ పేర్కొన్నారు.