ఒకరి అజాగ్రత్తకు ఇంకొకరి దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-20T06:59:34+05:30 IST

జాతీయ రహదారి పక్కన నిలిపిన కారు డోర్‌ను అజాగ్రత్తగా తీయడంతో.. పక్కనే వస్తున్న ద్విచక్ర వాహనదారుడికి తగిలింది.

ఒకరి అజాగ్రత్తకు ఇంకొకరి దుర్మరణం
నరేంద్రకుమార్‌

 కారు డోరు తగిలి బైకు బోల్తా

లారీ దూసుకెళ్లడంతో అసువులు బాసిన స్విమ్స్‌ ఉద్యోగి 


చంద్రగిరి, జనవరి 19: జాతీయ రహదారి పక్కన నిలిపిన కారు డోర్‌ను అజాగ్రత్తగా తీయడంతో.. పక్కనే వస్తున్న ద్విచక్ర వాహనదారుడికి తగిలింది. ఆయన కింద పడటంతో వెనకే వస్తున్న లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన చంద్రగిరి మండలం కాశిపెంట్ల వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాకాల మండలం ఇరంగారిపల్లెకు చెందిన నరిసింహులుశెట్టి కుమారుడు నరేంద్రకుమార్‌(43) తిరుపతి స్విమ్స్‌లో రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. డ్యూటీకోసం మంగళవారం స్వగ్రామం ద్విచక్ర వాహనంపై తిరుపతికి బయలుదేరారు. కాశిపెంట్ల వద్దకు రాగానే రోడ్డు పక్కన నిలిపిన కారులో ఉన్న ప్రయాణికులు ఉన్నట్లుండి డోరు తెరిచారు. ఈ డోరు తగిలడంతో ద్విచక్ర వాహనం సహా నరేంద్రకుమార్‌ రోడ్డుపై పడిపోయారు. వెనకే వస్తున్న వేగంగా వస్తున్న లారీ నరేంద్రకుమార్‌ తలపై దూసుకెళ్లడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-20T06:59:34+05:30 IST