తెలుగు జాతిని మేల్కొలిపిన మహాకవి శ్రీశ్రీ

ABN , First Publish Date - 2021-08-10T07:15:51+05:30 IST

తన కవిత్వంతో తెలుగు జాతిని మేల్కొలిపిన మహాకవి శ్రీశ్రీ అని ప్రసిద్ధ రచయితలు, రాజకీయ నాయకులు కీర్తించారు.

తెలుగు జాతిని మేల్కొలిపిన మహాకవి శ్రీశ్రీ
మహాప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖులు

మహాప్రస్థానం కాఫీ టేబుల్‌ ఎడిషన్‌ ఆవిష్కరణ సభలో వక్తలు


తిరుపతి రూరల్‌, ఆగస్టు 9: తన కవిత్వంతో తెలుగు జాతిని మేల్కొలిపిన మహాకవి శ్రీశ్రీ అని ప్రసిద్ధ రచయితలు, రాజకీయ నాయకులు కీర్తించారు. తిరుపతిలో సోమవారంనాడు మానవ వికాస వేదిక, రాజా చంద్ర ఫౌండేషన్‌ కలిసి మహాప్రస్థానం కాఫీ టేబుల్‌ ఎడిషన్‌ ఆవిష్కరణ  కార్యక్రమం నిర్వహించాయి. సభలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే తనకు శ్రీశ్రీతో ఏర్పడిన అనుబంఽధాన్ని గుర్తు చేసుకున్నారు.తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ కోనేటికట్టపై శ్రీశ్రీ, చెరబండరాజు, వరవరరావు ఉపన్యాసాలు తనపై బలమైన ముద్ర వేశాయని తెలిపారు. శ్రీశ్రీ దేశచరిత్రలు కవితను సభలో కరుణాకర రెడ్డి వినిపించారు. డెమ్మీ సైజు మహాప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించిన భూమన అభినయరెడ్డి మాట్లాడుతూ, తన తండ్రి నుంచి వారసత్వంగా తనకు శ్రీశ్రీ కవిత్వం అందిందని చెప్పారు. మహాప్రస్థానం కవిత్వాన్ని తనకు అర్ధాలు సహా ఆయన వివరించేవాడని అన్నారు. సమాజ ప్రగతిని ఆకాంక్షించే వారికి మహాప్రస్థానం పుస్తకం పాఠ్య గ్రంథం లాంటిదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ.. శ్రీశ్రీ అంతటి ప్రభావశీలమైన రచయిత తెలుగులో అరుదుగా ఉన్నారని తెలిపారు.  ఈ తరం యువత శ్రీశ్రీ మహా ప్రస్థానాన్ని చదవాలని సూచించారు. సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ, దేవుడు లేడన్న శ్రీశ్రీ పుస్తకాన్ని దేవుడి పాదాల సన్నిధిలో ఆవిష్కరించడం విశేషం అన్నారు. సినిమా పాటల్లో శ్రీశ్రీ ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించారంటూ పలు పాటలు ఆలపించారు. అభ్యుదయంతో పాటు ఎంతో సున్నితమైన అంశాలను కూడా శ్రీశ్రీ పాటల్లో చూడవచ్చని అన్నారు. తిరుపతి కార్పొరేషన్‌ మేయర్‌ శిరీష మాట్లాడుతూ, శ్రీశ్రీ రాసిన పుస్తకాన్ని తిరుపతిలో ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. అంతకు మునుపు రాజాచంద్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ, ఎన్నో ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థలు చేయాల్సిన శ్రీశ్రీ మహా ప్రస్థానం మహా ప్రచురణను, ఎన్నో కష్టాలను అధిగమించి శ్రీశ్రీ ప్రింటర్స్‌  విశ్వేశ్వరరావు వెలువరించడం గొప్ప విషయమని కొనియాడారు.విశ్వేశ్వరరావును అతిధులందరూ అభినందించి సత్కరించారు. శ్రీశ్రీని శ్వాసించిన వాడు విశ్వేశ్వరరావు అని వ్యాఖ్యానించారు. ఆవిష్కర్త భూమన అభినయరెడ్డి చేతుల మీదుగా తొలి ప్రతిని అందుకున్న  రచయిత నామిని సుబ్రహ్మణ్యంనాయుడు, శ్రీశ్రీ మరణించిన నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. శ్రీశ్రీ ప్రింటర్స్‌ అధినేత విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని ఈ రూపంలో పాఠకులకు అందించాలనే ఆలోచన ముందు తాను ఎదుర్కొన్న అన్ని సమస్యలూ తనకు చిన్నవిగానే కనిపించాయని చెప్పారు. మానవ వికాస వేదిక కన్వీనర్లు సాకం నాగరాజ, శైల కుమార్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సాహిత్యవేత్తలు కోట పురుషోత్తం, మధురాంతకం నరేంద్ర, కలువగుంట రామ్మూర్తి, వాకా ప్రసాద్‌, గంగవరం శ్రీదేవి, యువశ్రీ మురళి, నాదెండ్ల శ్రీమన్నారాయణ, పేరూరు బాలసుబ్రమణ్యం, నెమిలేటి కిట్టన్న, ఆకుల మల్లేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సీపీఎం నాయకులు కందారపు మురళి, జయచంద్ర, సాయిలక్ష్మి, నాగరాజు, పలువురు రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. 


రోడ్డుపక్కన శ్రీశ్రీ కవితా పఠనం

మహాప్రస్థానం ఆవిష్కరణకు ముందు తిరుపతి ఆర్టీసీ బస్టాండు ఎదురుగా వున్న  కెన్సెస్‌ హోటల్‌ బయట రోడ్డు పక్కన టెంట్‌లో శ్రీశ్రీ నిలువెత్తు చిత్రాలు ప్రదర్శించారు. మహాప్రస్థానంలోని గీతాలను ఒక్కొక్కరూ పఠించారు. చివర్లో కరుణాకరరెడ్డి సహా సాహితీ ప్రముఖులు అందరూ కలిసి సామూహికంగా కవితాపఠనం చేశారు. ఆ దారిన వెళ్లే  ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా చూశారు. 

Updated Date - 2021-08-10T07:15:51+05:30 IST