స్కిట్ కళాశాల మూసివేత తగదు
ABN , First Publish Date - 2021-10-30T05:00:09+05:30 IST
స్కిట్ కళాశాల మూసివేత నిర్ణయం తగదని రాష్ట్ర అస్యూరెన్స్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీలు మాధవ్, యండపల్లె శ్రీనివాసులురెడ్డి ఖండించారు.
శ్రీకాళహస్తి, అక్టోబరు 29: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల మూసివేత నిర్ణయం తగదని రాష్ట్ర అస్యూరెన్స్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీలు మాధవ్, యండపల్లె శ్రీనివాసులురెడ్డి ఖండించారు. శుక్రవారం ముక్కంటి దర్శనార్థం వచ్చిన కమిటీ సభ్యులు ఆలయ పరిపాలన భవనంలో ఈవో పెద్దిరాజుతో సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడుతూ... ప్రతిష్టాత్మక స్కిట్ కళాశాలను మూసివేయాలని నిర్ణయించడం సమంజసం కాదన్నారు. భవిష్యత్తు తరాలకు సాంకేతిక విద్య అందుబాటులో ఉండాలని సూచించారు. కనీసం స్కిల్ డెవల్‌పమెంట్ కేంద్రంగా స్కిట్‌ను కొనసాగించాలని కోరారు. కైలాసగిరి పర్వతాల చుట్టూ ఉన్న ముక్కంటి ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆలయ పరిసరాల్లో రోడ్లను, అనుబంధ ఆలయాలు, కాటేజీలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా స్వర్ణముఖి నది ప్రక్షాళనకు నోచుకోవడం లేదని గుర్తుచేశారు. ప్రక్షాళన పూర్తి చేసి, భక్తులకు అన్ని వసతులతో కూడిన స్నానఘట్టాలు నిర్మించాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ నిర్వహణ అధికశాతం ఒప్పంద ఉద్యోగులతో కొనసాగించడం మంచిది కాదన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది కడుపుకొట్టకుండా దశలవారీగా శాశ్వత నియామకాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం, పీఆర్వో హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.