ఉప ఎన్నిక మనకు ప్రీ ఫైనల్‌

ABN , First Publish Date - 2021-03-24T06:04:28+05:30 IST

‘మూడేళ్ల తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు తిరుపతి ఉప ఎన్నిక ప్రీ ఫైనల్‌ వంటిది.

ఉప ఎన్నిక మనకు ప్రీ ఫైనల్‌
టీడీపీ సమావేశంలో ప్రసంగిస్తున్న పనబాక లక్ష్మి

 22మంది వైసీపీ ఎంపీలతో ఒరిగిందేమీ లేదు

బీజేపీ అన్నీ అమ్మకానికి పెట్టేస్తోంది

పనబాక గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుదాం

టీడీపీ సన్నాహక సమావేశంలో నేతల పిలుపు


తిరుపతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ‘మూడేళ్ల తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు తిరుపతి ఉప ఎన్నిక ప్రీ ఫైనల్‌ వంటిది. దీనిలో మన సత్తా చూపిస్తే మూడేళ్లవరకు అధికార పార్టీలకు చెంప పెట్టులా ఉంటుంది. ఇక పట్టుమని పాతికరోజులు కూడా లేవు. సర్వ శక్తులు ఒడ్డి టీడీపీ జెండాను ఎగురవేద్దాం’ అంటూ ఆ పార్టీ ముఖ్యనేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న యనమల మాట్లాడుతూ  స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే దౌర్జన్యాలకు దిగారని, ఉపఎన్నికలో అది సాధ్యపడదని వారికి అర్థమయ్యే ఒక్కో నియోజకవర్గంలో మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలను కేటాయించారన్నారు. ఒక్క చాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని జగన్‌ దోచేస్తున్నాడని, ప్రజలను నట్టేట ముంచాడని ఆరోపించారు. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తిరుపతిలో టీడీపీ ఎంపీ గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నారు. తిరుపతి పవిత్రతను వైసీపీ నేతలు భ్రష్టుపట్టించారన్నారు. జగన్‌ జిమ్కిక్కుల సీఎం అని ఎద్దేవా చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలపై వైసీపీ ఎంపీలు ఎందుకు నోరు విప్పరని ప్రశ్నించారు. కేంద్రంలోని పెద్దలను చూస్తే ఎంపీలకు ఎందుకు భయమన్నారు. ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి మాట్లాడుతూ వైసీపీ నేతల బెదిరింపులకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందన్నారు. వైసీపీకి ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రావని ఓటర్లను బెదిరిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలకు గాలికొదిలేసిన వైసీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. టీడీపీకి తిరుపతి కంచుకోటగా నిరూపించాలని ఆమె కోరారు.అమరనాథ రెడ్డి మాట్లాడుతూ జగన్‌  చేతకాని పాలనను ప్రజలు బాగా అర్థం చేసుకున్నారన్నారు. పరసా రత్నం మాట్లాడుతూ అమరావతి భూముల విషయంలో చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టే హక్కు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏముందని ప్రశ్నించారు. కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు అధికార పార్టీ అరాచకాలతోనే ఓడిపోయారన్నారు. ఉప ఎన్నికలో తిరుపతి సెగ్మెంట్‌ నుంచి 40వేల ఓట్ల మెజారిటీని పనబాక లక్ష్మికి తీసుకొస్తామన్నారు. నాయకులు పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, బత్యాల చెంగల్రాయులు, సతీష్‌రెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి, సూరా సుధాకర్‌ రెడ్డి, ఎన్బీ సుధాకర్‌ రెడ్డి, వీరప్పరెడ్డి, పుష్పావతి యాదవ్‌, శ్రీధర్‌ వర్మ, బీఎల్‌ సంజయ్‌, విజయలక్ష్మి, దంపూరి భాస్కర్‌, మన్నెం శ్రీనివాసులు, రవినాయుడు, హేమంత్‌ రాయల్‌, బ్యాంకు శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-24T06:04:28+05:30 IST