దండు కదిలింది

ABN , First Publish Date - 2021-12-09T07:57:32+05:30 IST

అమరావతికి జైకొట్టి, అధికారంలోకి వచ్చాక ఛీకొట్టిన ముఖ్యమంత్రి జగన్‌ సొంత నియోజకవర్గం నుంచే రైతులు వచ్చి పాదయాత్రతో కలిసి నడిచారు. మహా పాదయాత్రగా వస్తున్న అమరావతి మహిళా రైతులకు తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష పసుపుకుంకుమ ఇచ్చి గౌరవించారు

దండు కదిలింది
మహిళా రైతులకు చక్రాల ఉష పసుపుకుంకుమ

మహిళా రైతులకు పసుపుకుంకుమ


శ్రీకాళహస్తి, డిసెంబరు 8: మహా పాదయాత్రగా వస్తున్న అమరావతి మహిళా రైతులకు తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష పసుపుకుంకుమ ఇచ్చి గౌరవించారు. బుధవారం ఉదయం చింతలపాళెం వద్దకు చేరుకున్న ఆమె అమరావతి రైతులకు స్వాగతం పలికారు. అనంతరం యాత్ర వెంబడి వస్తున్న 101 మంది మహిళలను ముక్కంటి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు. సంప్రదాయం మేరకు హిందూ మహిళలు పవిత్రంగా భావించే పసుపుకుంకుమ సాంగ్యమిచ్చారు. శ్రీవారి దర్శనానికి వెళ్తున్న తమను గౌరవించడం పట్ల మహిళా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 


అమరావతికి జైకొట్టి, అధికారంలోకి వచ్చాక ఛీకొట్టిన ముఖ్యమంత్రి జగన్‌ సొంత నియోజకవర్గం నుంచే రైతులు వచ్చి పాదయాత్రతో కలిసి నడిచారు.  ముస్లిం మైనారిటీలు సైతం ‘మేమూ మీ వెంటే!’ అన్నారు.  కాలికి కట్టుతోనే వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పిడికిలి బిగించి సంఘీభావం తెలిపారు.చిత్తూరు జిల్లాలో రెండో రోజున 16 కిలోమీటరునడిచిన రైతులను ఊరూరా లభించిన స్వాగతాలు ఊరడించాయి.పసుపునీళ్లతో రోడ్లు కడిగి, పూలు చల్లి, పసుపు కుంకాలు కానుకగా ఇచ్చి పల్లె పల్లెనా జనం ‘మీ వెంటే మేమంతా’ అంటూ బాసటగా నిలిచారు. చిత్తూరు జిల్లా ప్రజల నుంచి లభించిన అనూహ్య ఆదరాభిమానాలకు పులకించిన రైతు దళం కదంతొక్కుతూ కదిలి సాగింది. 


అమరావతి రైతులకు విరాళాల వెల్లువ 


శ్రీకాళహస్తి, డిసెంబరు 8: జిల్లాకు తరలి వచ్చిన అమరావతి పరిరక్షణ సమితి నేతలకు బుధవారం పెద్దఎత్తున విరాళాలందాయి. తొలిరోజు మంగళవారం పాదయాత్రలో ఇద్దరు మాత్రమే విరాళాలిచ్చారు. రెండో రోజు 54 మంది దాతలు తమ వంతు సాయం అందజేశారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన కొండ్రగుంట వాణి రూ.2లక్షలు, గుంటూరుకు చెందిన చేకూరి రామాంజనేయులు రూ.1.33 లక్షలు, పిచ్చాటూరు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ పద్మనాభరాజు రూ.50 వేలు ఇచ్చారు. కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చి అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన బాలస్వామిరెడ్డి, మునిరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, షబ్బీర్‌, కొండయ్య, భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కుప్పారెడ్డి, నాగభూషణం తదితరులు తమ వంతు నగదును విరాళంగా సమర్పించారు. మొత్తంగా రెండో రోజు రూ.4.41లక్షల విరాళం అందినట్లు అమరావతి జేఏసీ నేతలు తెలిపారు.


పాదయాత్రలో ఉత్కంఠ


శ్రీకాళహస్తి, డిసెంబరు 9: అమరావతి రైతుల మహా పాదయాత్రలో కాసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బుధవారం ఏర్పేడు మండలం చింతలపాళెం నుంచి మొదలైన పాదయాత్ర జింగిలిపాళెం దళితవాడ వరకు సజావుగా సాగింది. ఈ నేపథ్యంలో దళితవాడ వద్దకు చేరుకున్న ఏఎస్పీలు విద్యాసాగర్‌ నాయుడు, ఆరీఫుల్లా గురువారం శ్రీకాళహస్తిలో జరిగే యాత్రపై జేఏసీ నేతలతో చర్చించారు. పట్టణంలో ఇరుకైన మార్గాల్లో యాత్ర సాగితే ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తు రూట్‌మ్యాప్‌ తయారు చేశారా, ఉంటే చూపండని ప్రశ్నించారు. దీంతో గురువారం శ్రీకాళహస్తి పట్టణంలో జరిగే యాత్రకు అడ్డంకులు ఎదురవుతాయోమోనన్న ఆందోళన నెలకొంది. కాసేపటి తర్వాత ఎలాంటి సమస్యలు లేవని ఏఎస్పీ విద్యాసాగర్‌ స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. పోలీసుల సూచన మేరకు ప్రజలకు ఇబ్బందులు ఎదురవకుండా యాత్ర సాగిస్తామన్నారు.కుట్రపూరితంగా పాదయాత్రను అడ్డుకుంటే మాత్రం నిరసనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.


నేటి పాదయాత్ర సాగేదిలా...


శ్రీకాళహస్తి, డిసెంబరు 8: శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం ఉదయం 9గంటలకు హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద మహాపాదయాత్ర ప్రారంభం అవుతుంది.రైల్వేస్టేషన్‌, ఏపీసీడ్స్‌ కూడలి, పొన్నాలమ్మ గుడిరోడ్డు మీదుగా అగ్రహారం కూడలి, బాలుర ఉన్నత పాఠశాల, రామసేతు వంతెన మీదుగా నెహ్రూ రోడ్డు, పెండ్లిమండపం అక్కడి నుంచి ముత్యాలమ్మగుడి వీధి మీదుగా గోపాలవనం, ఉప్పువీధి, బహదూరుపేట, కంఠా వీధి, నల్లగంగమ్మగుడి రోడ్డుమీదుగా తెట్టు కూడలి అక్కడి నుంచి ముత్తరాసిపాళెం రోడ్డు మీదుగా శీతాలాంబ ఆలయం కూడలి, కొత్తపేట, కార్గిల్‌ సెంటర్‌, బాలికల ఉన్నత పాఠశాలరోడ్డు, పాతబస్టాండు కూడలి అక్కడి నుంచి అంబేడ్కర్‌ కూడలి, పీవీరోడ్డుమీదుగా వీఎంసీ కూడలి, అక్కడి నుంచి జయరామరావువీధి, భేరివారి మండపం, బజారువీధి, రాజగోపురం చేరుకున్నాక శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజలు నిర్వహిస్తారు.అనంతరం  తేరువీధి, సూపర్‌ బజారు కూడలి మీదుగా అమరజ్యోతి కల్యాణమండపం కూడలి వరకు అక్కడి నుంచి శ్రీరామ్‌నగర్‌కాలనీ మీదుగా రోటరీక్లబ్‌ రోడ్డులో నుంచి పూతలపట్టు-నాయుడుపేట బైపా్‌సరోడ్డుకు చేరుకుని అటు నుంచి తిరిగి రైల్వేగేటు వద్ద శిబిరానికి సాగనున్నట్లు జేఏసీ నిర్వాహకులు తెలిపారు. 

నేడు కర్ణాటక రైతుల సంఘీభావం : అమరావతి రైతుల పాదయాత్రకు గురువారం కర్ణాటక రైతుల బృందం మద్దతు తెలపనుంది.శ్రీకాళహస్తిలో మధ్యాహ్న భోజన సమయానికి వారు ఇక్కడకు చేరుకోనున్నారు.


ఆ దేవుడే చూసుకుంటాడు


400 కిలోమీటర్లు పెద్దలూ, పిల్లలూ కలిసి నడిచి వచ్చాం. కాళహస్తీశ్వరుడి సన్నిధిలో బస చేసి ఆయన దర్శనం చేసుకోవాలని 

అనుకున్నాం. అందుకే ఒక రోజు విరామం కూడా ప్రకటించాం.మేం ముందే అడ్వాన్సు కట్టి బుక్‌ చేసుకున్న 

మండపాన్నే మాకు ఇవ్వకుండా చేశారు. ఇంత రాక్షసత్వం ఎక్కడైనా ఉంటుందా? ఆ దేవుడే చూసుకుంటాడు.

- శివారెడ్డి, తిరుపతిరావు, బాలకోటయ్య 

పాదయాత్ర నిర్వాహకులు


రెండేళ్లుగా ఏడవని రోజు లేదయ్యా


తండ్రి నుంచి పిత్రార్జితంగా నాలుగు ఎకరాలు రాగా,భూదేవి కరుణించడంతో మరో 20ఎకరాలు సంపాదించాను.రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పడంతో మా కుటుంబమంతా 24 ఎకరాల భూములూ ఇచ్చేశాం. అమరావతిలో రాజధాని వద్దు అని ఎన్నికలకు ముందు చెప్పకుండా, అధికారంలోకి వచ్చాక మమ్మల్ని 

వంచించారు.  రెండేళ్లుగా ఏడవని రోజు లేదయ్యా.

- ఆలూరి కోటేశ్వరరావు, 

మందడం, తుళ్లూరు మండలం

Updated Date - 2021-12-09T07:57:32+05:30 IST