ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: ఫ్యాప్టో
ABN , First Publish Date - 2021-07-24T06:17:50+05:30 IST
అపరిష్కృత ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ఫ్యాప్టో నేతలు శ్రీకాళహస్తి రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

శ్రీకాళహస్తి, జూలై 23: అపరిష్కృత ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ఫ్యాప్టో నేతలు డిమాండు చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక రెవె న్యూ తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఫ్యాప్టో నేతలు మాట్లాడుతూ పీఆర్సీ అమలు మూడేళ్లుగా వాయిదా పడుతున్నా, ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పటికీ హామీ అమలు చేయక పోవడం బాధాకరమన్నారు. ఆరు విడతల కరువుభత్యం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పదవీ విరమణ పొందిన, మృతిచెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు పెన్షన్ తదితర ప్రయోజనాల చెల్లిపు నెలల తరబడి ఆలస్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టో మేరకు సకాలంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించక పోవడంతో రాష్ట్రంలో 25వేల పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదన్నారు. పాఠశాల విద్యను నిర్వీర్యం చేసే సర్క్యులర్ నెం.172ను రద్దు చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో నాయకులు బాబురెడ్డి, గోపీనాథం, సూర్యప్రకాష్, దావాల జయరాం, దేవేంద్ర, మాధవయ్య, పీవీరమణ, చెంచురత్నం యాదవ్, పీవీ సుబ్బారెడ్డి, చెంచయ్య పాల్గొన్నారు.