టీడీపీ బంద్ భగ్నం
ABN , First Publish Date - 2021-10-21T07:07:18+05:30 IST
అడుగడుగునా పోలీసు నిర్బంధాల నడుమ బుధవారం జిల్లాలో టీడీపీ తలపెట్టిన బంద్ భగ్నమైంది. జిల్లావ్యాప్తంగా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. వి.కోట, రామకుప్పం మండల కేంద్రాల్లో టీడీపీ, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా నిరసనలకు దిగడం కూడా ఉద్రిక్తతకు కారణమైంది. మరోవైపు జిల్లాలో టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగకుండా అడుగడుగునా అడ్డుపడిన పోలీసులు వైసీపీ శ్రేణుల నిరసన కార్యక్రమాలను మాత్రం అనుమతించడం విమర్శలకు దారి తీసింది.
-జిల్లావ్యాప్తంగా పలువురు నేతల ముందస్తు అరెస్టు
-అయినా పలుచోట్ల రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు
-నిర్బంధాన్ని ఛేదించి మరీ మాజీ మంత్రి అమర్ ఆందోళన
-రొంపిచెర్లలో చల్లాబాబు హౌస్ అరెస్టుతో ఉద్రిక్తత
-టీడీపీకి పోలీసు అడ్డంకులు... వైసీపీ నిరసనలకు అనుమతులు
తిరుపతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి):టీడీపీ తలపెట్టిన బంద్ నేపథ్యంలో పలమనేరులో మాజీ మంత్రి అమరనాధరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిగుంట మనోహర్‌నాయుడు, శాంతిపురంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పంలో చంద్రబాబు పీఏ మనోహర్, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి మునిరత్నం, రొంపిచెర్లలో టీడీపీ ఇంఛార్జి చల్లా రామచంద్రారెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్, టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, నగరి టీడీపీ ఇంఛార్జి గాలి భానుప్రకాష్, ఊరందూరులో శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి, పాలసముద్రంలో జీడీనెల్లూరు టీడీపీ సమన్వయకర్త చిట్టిబాబు, కెళవాతిలో టీడీపీ నేత శ్రీనాధరెడ్డి, బి.కొత్తకోటలో తెలుగుమహిళ రాష్ట్ర నేత పర్వీన్ తాజ్ తదితరులను పోలీసులు ముందస్తుగా బుధవారం వేకువజామునే హౌస్ అరెస్టు చేశారు.అలాగే బంద్ విజయవంతం చేయడానికి ఆందోళనకు దిగిన పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. తిరుపతిలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగిన కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు, నేతలు మబ్బు దేవనారాయణరెడ్డి, పుష్పావతి తదితరులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.చంద్రగిరిలో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టిన చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానీ సహా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి బస్సులో స్టేషన్‌కు తరలించారు. తిరుచానూరు మార్కెట్ యార్డు కూడలిలో కార్యకర్తలు ధర్నాకు దిగగా వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కలకడ మండలం బాటవారిపల్లెలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలో జరిగిన తోపులాటలో ఆయన దుస్తులు కూడా చిరిగిపోయాయి. చిత్తూరు నగరం దొడ్డిపల్లెలో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టిన టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలను, అలాగే గాంధీ విగ్రహం కూడలిలో బైఠాయించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. యాదమరి, ఐరాల, కాణిపాకం, గుడిపాల, పెనుమూరు, పూతలపట్టుల్లో సైతం నిరసనలకు దిగిన శ్రేణుల్ని అరెస్టు చేశారు. మదనపల్లెలో టీఎన్‌ఎస్‌ఎఫ్ విద్యా సంస్థలను మూసివేయిస్తుండగా ర్యాలీగా పోలీసులు అడ్డుకుని వన్ టౌన్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే తెలుగుయువత కార్యకర్తలను కూడా వన్ టౌన్‌కు తరలించారు.
పలమనేరు, రొంపిచెర్ల, రామకుప్పం, వి.కోటల్లో ఉద్రిక్తత
పలమనేరులో మాజీ మంత్రి అమరనాధరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో వుంచగా వందలాదిమంది కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. అమర్‌ను వెలుపలికి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల నడుమా తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తక్కువ సంఖ్యలో వుండడంతో వారిని నెట్టేసి వెలుపలికి వచ్చిన అమర్ కార్యకర్తలతో కలసి టవర్ క్లాక్ కూడలిలో బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రొంపిచెర్లలో పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా రామచంద్రారెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేయగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చి ఆయన్ను గృహ నిర్బంధం నుంచీ తప్పించేందుకు యత్నించారు.ఆ సందర్భంగా పోలీసులను నెట్టుకుని చల్లా గేటు పైకెక్కి మరీ వెలుపలికి వెళ్ళేందుకు యత్నించగా పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత తలెత్తింది.వి.కోట పట్టణంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకే కూడలిలో నిరసనలకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఇరువర్గాలనూ చెదరగొట్టేందుకు యత్నించినా సాధ్యపడలేదు. దీంతో టీడీపీ వర్గీయులు సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేయగా వైసీపీ వర్గీయులు చంద్రబాబు,పట్టాభి దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అదనపు పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలనూ చెదరగొట్టాయి. కుప్పం నియోజకవర్గం రామకుప్పం, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు పోలీసు స్టేషన్ల ఎదుటే నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.టీడీపీ శ్రేణులను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు వైసీపీ వారి జోలికి మాత్రం వెళ్ళలేదు. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు స్వేచ్ఛగా టీడీపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ విషయంలో జిల్లా పోలీసులు అనుసరించిన ద్వంద్వ వైఖరి విమర్శలకు దారి తీసింది.



