దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-10-20T06:28:06+05:30 IST

రేణిగుంటలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న తమపై మారణాయుధాలతో దాడి చేసిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని టీడీపీ నాయకులు డిమాండు చేశారు.

దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి
జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట రోడ్డుపై భైఠాయించి నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు.

అర్బన్‌ ఎస్పీ కార్యాలయంవద్ద టీడీపీ నేతల బైఠాయింపు 


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 19: రేణిగుంటలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న తమపై మారణాయుధాలతో దాడి చేసిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని టీడీపీ నాయకులు డిమాండు చేశారు. ఈ దాడిని చూస్తూ కూడా రక్షణ కల్పించని రేణిగుంట పోలీసుల తీరును నిరసించారు. ఈ మేరకు తిరుపతిలోని అర్బన్‌ ఎస్పీ కార్యాలయం ఎదుట మంగళవారం రాత్రి నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. తమ ర్యాలీపై రేణిగుంట ఎంపీపీ హరిప్రసాద్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సుజాత, రేణిగుంట, తూకివాకం సర్పంచులు నగేష్‌, మునిశేఖర్‌రెడ్డి, జువ్వల దయాకర్‌రెడ్డి, గంగాధర్‌, వడ్డిమిట్ట వార్డు మెంబర్‌ ఈశ్వరి, వేణుగోపాలపురం వార్డు మెంబర్‌ కృష్ణమూర్తి, రేణిగుంట ఉప సర్పంచ్‌ ఇర్ఫాన్‌, అన్నాసంపల్లెకు చెందిన పేరూరు  మునిరెడ్డి, రిహాన్‌, రసూల్‌బీ, మురళి, ఉప్పు వెంకటరమణ, మరికొందరు వైసీపీ శ్రేణులు రాళ్లు, చెప్పులు, కర్రలతో దాడికి పాల్పడ్డారని అదనపు ఎస్పీ సుప్రజకు టీడీపీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. తనను కాళ్లతో తన్నుతూ, చేతులతో గుద్దుతూ అంతమొందించేందుకు ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేశారు. అతికష్టంపై వారినుంచి తప్పించుకుని వెళ్లిపోతుండగా మళ్లీ కర్రలు, ఇతర మారణాయుధాలతో తరుముతూ దాడికిపాల్పడ్డారన్నారు. తాను, నాయకులు ఎక్కిన కార్ల అద్దాలు  ధ్వంసం చేశారన్నారు. ఈ దాడిలో తనతోపాటు మునిచంద్రశేఖర్‌రెడ్డి, మహబూబ్‌బాషా గాయపడ్డారంటూ గాయాలను చూపించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆదేశాల మేరకే వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తమపై దాడి జరుగుతున్నా రేణిగుంట పోలీసులు రక్షణ కల్పించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి దాడికి పాల్పడినవారిపై కేసులు నమోదుచేసి శిక్షించాలని ఏఎస్పీని కోరారు. తిరుపతి లోక్‌సభ నియోజవర్గ ఇన్‌చార్జి నరసింహయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నగరపాలక సంస్థ కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ, నేతలు శ్రీధర్‌వర్మ, మబ్బు దేవనారాయణరెడ్డి, బుల్లెట్‌ రమణ, సూరా సుధాకర్‌రెడ్డి, రవినాయుడు, ఊట్ల సురేంద్రనాయుడు, సత్యవేడు జేడీ రాజశేఖర్‌, చక్రాల ఉష తదితరులు ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినవారిలో ఉన్నారు.

Updated Date - 2021-10-20T06:28:06+05:30 IST