ఎస్వీయూ రిటైర్డు ప్రొఫెసర్‌ అనంత జయంత కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-14T05:19:07+05:30 IST

ఎస్వీ యూనివర్సిటీ ఆంగ్ల విభాగ విశ్రాంత ప్రొఫెసర్‌ రాళ్లపల్లి అనంత జయంత (91) గురువారం కరోనాతో కన్నుమూశారు.

ఎస్వీయూ రిటైర్డు ప్రొఫెసర్‌ అనంత జయంత కన్నుమూత
అనంత జయంత (ఫైల్‌ ఫొటో)

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 13: ఎస్వీ యూనివర్సిటీ ఆంగ్ల విభాగ విశ్రాంత ప్రొఫెసర్‌ రాళ్లపల్లి అనంత జయంత (91) గురువారం కరోనాతో కన్నుమూశారు. ఈయన టీటీడీ ఆస్థాన పండితుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మకు చిన్న కుమారుడు. భారతీయ ఆంగ్ల సాహిత్యంపై సాధికారికత కలిగిన ప్రొఫెసర్‌ అనంత జయంత, 1990లో ఎస్వీయూ ఆంగ్ల విభాగ ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఆంగ్లంతో పాటు సంస్కృతం, కన్నడ భాషల్లో నిపుణులు. కర్ణాటక సంగీత పరిజ్ఞానం గల ఈయన అన్నమయ్య కీర్తనల రాగ వైశిష్ఠ్యంపై సవివర వ్యాఖ్యానం చేశారు. 18, 19వ శతాబ్దపు ఆంగ్ల సాహిత్యంపై అధ్యయనం చేశారు. పలు అనువాదాలు చేశారు. ‘భారతీయ సాహిత్యం- దృక్పథాలు’ అంశంపై అనంత జయంత అభినందన సంచికను వీరి శిష్యులు 1992లో ప్రచురించారు. నెల్లూరులోని విక్రమసింహపురం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు కూడా ఈయన శిష్యుడే. ఈయనకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో ప్రొఫెసర్‌ దీప్తా రాష్ట్రీయ విద్యాపీఠం ఆంగ్ల విభాగాధిపతిగానూ, వాగ్దేవి ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో రీసెర్చ్‌ అసోసియేట్‌గానూ వ్యవహరిస్తున్నారు. తిరుపతిలోని కనకభూషణం లే అవుట్‌లో ఉంటున్నారు. చాలా కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. పద్మావతి కొవిడ్‌ సెంటర్‌లో చికిత్స పొందుతూ గురువారం కన్ను మూశారు. గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఈయన మృతి పట్ల ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్ర, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ రిటైర్డు ప్రొఫెసర్‌ మృణాళిని, ఎస్వీయూ ఆంగ్ల విభాగ అధ్యాపకులు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-05-14T05:19:07+05:30 IST